క్రెడిట్ కార్డులతో ప్రపంచ రికార్డు

8 Jan, 2016 03:09 IST|Sakshi
క్రెడిట్ కార్డులతో ప్రపంచ రికార్డు

 షాపింగ్ మాల్‌లో సామాన్లు కొనేటప్పుడు పే చేయడానికి మనం చాలాసార్లు క్రెడిట్ కార్డు వాడుతుంటాం. పే చేయడానికి ఏ క్రెడిట్ కార్డు వాడాలన్న కన్ఫ్యూజన్ మనకు పెద్దగా ఉండదు. ఎందుకంటే.. మన దగ్గర ఒకటో రెండో ఉంటాయి కాబట్టి.. కానీ, కాలిఫోర్నియాకు చెందిన వాల్టర్ మాత్రం తెగ తికమకపడిపోతాడు. ఎందుకంటే.. ఆయన దగ్గర ఉన్న క్రెడిట్ కార్డుల సంఖ్య 1,497.. అందుకే ఈయన ప్రపంచంలోనే అత్యధిక క్రెడిట్ కార్డులున్న వ్యక్తిగా ప్రపంచ రికార్డు సాధించాడు. ఈ కార్డుల మొత్తం క్రెడిట్ విలువ రూ.11.33 కోట్లు.


ఎందుకిన్ని కార్డులని అడిగితే.. 1960ల్లో తన స్నేహితుడితో చేసిన ఓ చాలెంజ్ ఫలితమేనని వాల్టర్ చెబుతారు. ఓ ఏడాదిలో ఎవరెక్కువ క్రెడిట్ కార్డులు సంపాదిస్తామో చూద్దామని ఇద్దరూ పందెం వేసుకున్నారట. దీంతో వాల్టర్ ఏడాది వ్యవధిలో 143 క్రెడిట్ కార్డులు తీసుకున్నారు. తర్వాత కూడా దీన్ని కొనసాగించారు. 1971లో వాల్టర్ స్నేహితుడు ఒకరు గిన్నిస్ వారిని సంప్రదించగా.. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ క్రెడిట్ కార్డులు కలిగిన వ్యక్తిగా వాల్టర్ పేరును గిన్నిస్ బుక్‌లోకి ఎక్కించారు. అయితే.. అప్పట్నుంచి తన రికార్డును నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో ఏటా వాల్టర్ మరిన్ని క్రెడిట్ కార్డులను తీసుకోవడం.. ఏటా ఆయన రికార్డును ఆయనే బద్దలు కొట్టడం జరుగుతూనే ఉంది. ఈయన వద్ద ఉన్న కార్డుల్లో బ్యాంకులతోపాటు ఎయిర్‌లైన్స్, గ్యాస్ స్టేషన్లకు సంబంధించినవీ ఉన్నాయి. అంతేకాదు.. ఇప్పటికీ రెగ్యులర్‌గా ఏదో ఒక క్రెడిట్ కార్డు కోసం ఈయన దరఖాస్తు చేస్తూనే ఉంటారట.

మరిన్ని వార్తలు