ఆ రైలు అదే.. కిమ్‌ అక్కడే ఉండొచ్చు!

26 Apr, 2020 17:11 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కిమ్‌ జాడను తెలిపే విషయం

వాషింగ్టన్‌/సియోల్‌: ఉత్తర కొరియా నియంత కిమ్‌ జోంగ్‌ ఉన్ ఆరోగ్య పరిస్థితి విషమించిందనే వార్తల నేపథ్యంలో ఆయన జాడను తెలిపే విషయమొకటి వెలుగుచూసింది. దేశంలోని రిసార్ట్‌ టౌన్‌లో కిమ్‌ కుంటుంబ సభ్యులకు మాత్రమే సేవలందించే ప్రత్యేక ట్రైన్‌ ఏప్రిల్‌ 21, 23 తేదీల్లో కనిపించినట్టు ఉత్తర కొరియాలో పనిచేస్తున్న వాషింగ్టన్‌ బేస్డ్‌ పర్యవేక్షణ ప్రాజెక్ట్ (38 నార్త్‌) తెలిపింది. శాటిలైట్‌ దృశ్యాల్లో లీడర్‌షిప్‌ స్టేషన్‌లో ఆ ప్రత్యేక ట్రైన్‌ ఆచూకీ బయటపడిందని పేర్కొంది. ఆ రైలులో కిమ్‌ ఉండే అవకాశాలు అధికంగా ఉన్నాయని అభిప్రాయడింది. ఒకవేళ కిమ్‌ ఆరోగ్య పరిస్థితి బాగోలేని పక్షంలో రైలు అక్కడ ఉండే అవకాశమే లేదని వెల్లడించింది.

అయితే 38 నార్త్‌ అభిప్రాయంతో ప్రముఖ మీడియా సంస్థ రాయిటర్స్‌ ఏకీభవించలేదు. కిమ్‌ వాన్‌సన్‌ నగరంలో ఉన్నారని చెప్పలేమని పేర్కొంది. ‘కిమ్‌ కుటుంబం మాత్రమే ప్రయాణించే రైలు ఆచూకీ ద్వారా అతను ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఆ రైలు ద్వారా  కిమ్‌ ఆరోగ్య వివరాలు వెల్లడి కావు. కానీ, కిమ్‌ దేశంలోని తూర్పు ఉన్నత ప్రాంతంలో ఉన్నాడనే వార్తలకు తాజా విషయం బలం చేకూర్చేదిగా ఉంది’ అని 38 నార్త్‌ పేర్కొంది. 
(చదవండి: కిమ్‌ ఆరోగ్యంపై గందరగోళం)

కాగా, ఏప్రిల్‌ 15న కిమ్‌ తన తాత ఇల్‌ సంగ్‌ 108 జయంతి వేడుకల్లో పాల్గొనకపోవడంతో ఆయన ఆరోగ్యం బాగోలేదన్న వదంతులు మొదలయ్యాయి. ఉత్తర కొరియాకు అత్యంత ముఖ్యమైన ఈ వేడుకలకు కిమ్‌ 2011లో అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి క్రమం తప్పకుండా హాజరవుతున్నారు. అయితే, అతని ఆరోగ్యంపై వస్తున్న వార్తల్లో నిజం లేకపోవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అభిప్రాయ పడ్డారు. మరోవైపు కిమ్‌కు చికిత్స అందించేందుకు చైనా ప్రభుత్వం వైద్య నిపుణుల బృందాన్ని పంపిందనే వార్తలతో మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనారోగ్యం ఏమీ లేనప్పుడు, అంతా బాగానే ఉన్నప్పుడు... ఉత్తర కొరియా ఎందుకు స్పందించట్లేదన్న ప్రశ్న తలెత్తుతోంది. 
(చదవండి: కోవిడ్‌ తిరగబెట్టదని గ్యారంటీ లేదు)

మరిన్ని వార్తలు