సిక్కింపై చైనా దూకుడు!

7 Jul, 2017 01:11 IST|Sakshi
సిక్కింపై చైనా దూకుడు!

టిబెట్‌లో ఆర్మీ ప్రత్యేక కసరత్తులు
అధునాతన ఆయుధాలతో విన్యాసాలు

బీజింగ్‌: సిక్కింలో భారత్‌తో ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో చైనా కయ్యానికి కాలు దువ్వుతోంది. టిబెట్‌లో ఎత్తయిన ప్రాంతాల్లో నిజమైన యుద్ధంలో ఎదురయ్యే పరిస్థితులను కృత్రిమంగా సృష్టించుకుని చైనాæ సైన్యం కసరత్తులు చేస్తోంది. తేలికపాటి యుద్ధ ట్యాంకులు సహా ఇతర ఆయుధ వ్యవస్థను పరీక్షిస్తోంది. సముద్ర మట్టానికి 5,100 మీటర్ల ఎత్తులో ఈ విన్యాసాలు జరుగుతున్నాయని చైనా ప్రభుత్వ మీడియా సంస్థ జిన్హువా న్యూస్‌ ఏజెన్సీ వెల్లడించింది.

ప్రతిఘటన కార్యకలాపాలు,  శత్రువును సమైక్యంగా ఎదుర్కోవడం, ఫైర్‌ షూటింగ్, ఆయుధాల సమగ్ర పరిశీలన తదితరాలను కసరత్తులో భాగం చేశారని పేర్కొంది. రక్షణ, దాడి చేసే శిక్షణా పద్ధతులను కూడా ఇందులో చేర్చారని తెలిపింది. ఈ కసరత్తుల ఫొటోలను కూడా జిన్హువా తన వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. మిలిటరీ విన్యాసాల్లో భాగంగా సుమారు 35 కిలోల బరువున్న యుద్ధ ట్యాంకులపై ట్రయల్స్‌ నిర్వహిస్తున్నట్లు గత వారం చైనా రక్షణ శాఖ అధికార ప్రతినిధి కల్నల్‌ వు కిన్‌ వెల్లడించారు.  

‘సిక్కిం’పై పునరాలోచిస్తాం..
తాజా సరిహద్దు వివాదం నుంచి భారత్‌ వెనక్కి తగ్గాలని.. లేదంటే స్వాతంత్య్రం కోసం సిక్కింలో వస్తున్న డిమాండ్లకు బీజింగ్‌ మద్దతివ్వాల్సి వస్తుందని చైనా మీడియా భారత్‌ను హెచ్చరించింది. చైనా అధికార కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో వెలువడే ‘గ్లోబల్‌ టైమ్స్‌’ఈ మేరకు భారత్‌పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది. ‘‘గతంలో భారత్‌ దలాలైమా కార్డు ఉపయోగించి చైనాను అడ్డుకునేది. కానీ ఇప్పుడు ఆ కార్డు పనికిరాకుండా పోయింది. ప్రస్తుతం ఆ కార్డు టిబెట్‌పై ఏ మాత్రం ప్రభావం చూపడం లేదు.

కానీ భారత్‌కు సంబంధించిన సున్నితమైన అంశాలపై బీజింగ్‌ తన వైఖరి మార్చుకుంటే.. అది ఢిల్లీతో డీల్‌ చేయడానికి పవర్‌ఫుల్‌ కార్డుగా పనిచేస్తుంది’’అని పేర్కొంది. సిక్కింను భారత్‌లో కలుపుకోవడానికి చైనా 2003లో గుర్తింపునిచ్చినా.. దీనిపై చైనా తన వైఖరిని మార్చుకోవచ్చని స్పష్టం చేసింది. ‘‘ప్రత్యేక దేశంగా సిక్కిం చరిత్రను గుర్తుంచుకున్న వారు ఇంకా అక్కడ ఉన్నారు. సిక్కిం సమస్యను ప్రపంచం ఎలా చూస్తోందనే అంశాన్ని వారు గమనిస్తున్నారు.

చైనాపై భారత్‌–వియత్నాం చర్చలు
న్యూఢిల్లీ: సరిహద్దుల్లో చైనా రెచ్చగొట్టే చర్యలపై భారత్‌–వియత్నాం తాజాగా చర్చలు జరిపాయి. ఇరు దేశాల ప్రయోజనాలను పరిరక్షించేందుకు స్పష్టమైన, ఆచరణయోగ్యమైన చర్యలు తీసుకోవాలని ద్వైపాక్షిక చర్చల్లో నిర్ణయించాయి. వియత్నాం ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఫామ్‌ బిన్‌ మిన్హ్‌.. నాలుగు రోజుల భారత పర్యటన గురువారంతో ముగిసింది. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌తో సమావేశమై చైనా సహా పలు కీలక అంశాలపై చర్చించారు. 

మరిన్ని వార్తలు