తీవ్రవాదంపై ఉమ్మడి పోరు

27 Aug, 2019 04:03 IST|Sakshi
సమావేశంలో అమిత్‌ షా, కిషన్‌ రెడ్డి

వామపక్ష తీవ్రవాదం నిర్మూలనకు కట్టుబడి ఉన్నాం: కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా

10 మావోయిస్టు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ  

న్యూఢిల్లీ: ఉమ్మడి పోరాటం, వ్యూహాలతో వామపక్ష తీవ్రవాద కార్యకలాపాలను దీటుగా ఎదుర్కోవాలని కేంద్రం, మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలు నిర్ణయించాయి. 10 మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలతో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సోమవారం ఢిల్లీలో నిర్వహించిన సమావేశానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితోపాటు ఇతర రాష్ట్రాల సీఎంలు నితీష్‌ కుమార్‌ (బిహార్‌), నవీన్‌ పట్నాయక్‌ (ఒడిశా), యోగి ఆదిత్యనాథ్‌ (యూపీ), కమల్‌నాథ్‌ (మధ్యప్రదేశ్‌), రఘుబర్‌ దాస్‌ (జార్ఖండ్‌), భూపేష్‌ భఘేల్‌ (ఛత్తీస్‌గఢ్‌), ఉన్నతాధికారులు హాజరయ్యారు.

మావోయిస్టుల ఏరివేతకు తీసుకుంటున్న చర్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై ఇందులో సమీక్షించారు. వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించిన సమావేశం ఫలప్రదమైంది. భద్రత, అభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై చర్చించాం. ప్రజాస్వామ్య విధానాలకు తీవ్రవాదం విఘాతం కలిగిస్తుంది. ప్రధాని మోదీ నాయకత్వంలో తీవ్రవాదం నిర్మూలనకు కట్టుబడి ఉన్నాం’అని సమావేశం అనంతరం అమిత్‌ షా ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అమిత్‌ షా హోంశాఖ పగ్గాలు చేపట్టిన అనంతరం ఇలాంటి సమావేశం జరగడం ఇదే తొలిసారి. హోంశాఖ, పారా మిలటరీ బలగాల ఉన్నతాధికారులు కూడా దీనికి హాజరయ్యారు.  

తీవ్రవాదం తగ్గుముఖం
► కేంద్ర హోంశాఖ గణాంకాల ప్రకారం 2009–13లో మావోయిస్టు హింసాత్మక చర్యలకు సంబంధించి 8,782 కేసులు నమోదు కాగా 2014–18లో 43.4 శాతం తగ్గిపోయి 4,969 కేసులు నమోదయ్యాయి.  
► 2009–13 మధ్య కాలంలో మావోయిస్టుల హింసకు 3,326 మంది (భద్రతా సిబ్బందితో కలిపి) బలయ్యారు. 2014–18లో తీవ్రవాదుల చేతుల్లో 1,321 మంది మృతి చెందారు.  

► 2009–18 వరకు 1,400 మందికిపైగా మావోయిస్టులు మరణించారు.  

►  ఈ ఏడాది తొలి ఐదు నెలల్లో దేశవ్యాప్తంగా మావోయిస్టుల హింసకు సంబంధించి 310 ఘటనలు నమోదు కాగా 88 మంది ప్రజలు చనిపోయారు.  
 

మరిన్ని వార్తలు