బ్రిటన్ పత్రిక సర్వేలో బాలీవుడ్ స్టార్ ‘అమితాబ్ కి అగ్రస్థానం

27 Jul, 2013 05:00 IST|Sakshi
బ్రిటన్ పత్రిక సర్వేలో బాలీవుడ్ స్టార్ ‘అమితాబ్ కి అగ్రస్థానం

లండన్: బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్‌బచ్చన్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. గ్రేటెస్ట్ బాలీవుడ్ స్టార్ కిరీటం ఆయనను వరించింది. భారతీయ సినిమా వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బ్రిటన్‌కు చెందిన ఈస్టర్న్ ఐ వార పత్రిక ఒక సర్వే నిర్వహించింది. వంద మంది గ్రేటెస్ట్ బాలీవుడ్ స్టార్లు ఎవరో తెలుసుకునేందుకు విమర్శకులు, అభిమానులు, చిత్ర సీమకు సంబంధించిన వారి నుంచి అభిప్రాయాలు తెలుసుకుంది. ఈ సర్వేలో బిగ్ బీ అమితాబ్ అగ్రస్థానాన్ని గెలుపొందారు. షోలే, దీవార్, జంజీర్ వంటి అనేక సినిమాలతో ప్రజల రివార్డులతో పాటు అనేక అవార్డులను అందుకున్నారు అమితాబ్. ఈ సర్వే కోసం ఈస్టర్న్ ఐ సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకుల ఓట్లను, బాక్సాఫీస్ రికార్డులను, సినిమా పరిశ్రమపై వారి ముద్ర తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంది. 40 ఏళ్ల పాటు చలనచిత్ర పరిశ్రమతో అనుబంధం కలిగిన అమితాబ్‌కి గ్రేటెస్ట్ బాలీవుడ్ స్టార్ అవార్డు దక్కడంతో ఆయన అభిమానులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.

బిగ్ బీ మాదిరిగా సుదీర్ఘ కాలం సినిమా ఇండస్ట్రీలో టాప్ రేంజ్‌లో నిలిచిన నటుడు మరొకరు లేరని, తన నటనతో అనేక మందిపై ఆయన చెరగని ముద్ర వేశారని షోబిజ్ మేగజైన్ ఎడిటర్ అజాద్ నజీర్ చెప్పారు. కాగా, ఈ సర్వేలో నటదిగ్గజం దిలీప్‌కుమార్ రెండో స్థానంలో నిలిచారు. దిలీప్‌కుమార్ అమితాబ్ బచ్చన్‌కు ఇష్టమైన నటుడు కావడం విశేషం. ఆయన తర్వాతి స్థానాన్ని బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ దక్కించుకున్నాడు. హీరోయిన్ల విషయానికి వస్తే అందాలభామ మాధురీదీక్షిత్ తొలి స్థానంలో నిలిచింది. ఓవరాల్ జాబితాలో ఈమెకు నాలుగో స్థానం దక్కడం విశేషం. టాప్ టెన్‌లో నిలిచిన వారిలో రాజ్‌కపూర్(5), నర్గీస్(6), దేవానంద్(7), వహీదారెహమాన్(8), రాజేష్‌ఖన్నా(9), శ్రీదేవి(10) ఉన్నారు. వీరితో పాటు సల్మాన్‌ఖాన్(11), ఆమిర్‌ఖాన్(14), ధర్మేంద్ర(15), హేమామాలిని(18), మధుబాల(24), కాజోల్(30), హృతిక్‌రోషన్(32), రాణిముఖర్జీ(38), కరీనాకపూర్(43), ముంతాజ్(50), సైఫ్‌అలీఖాన్(59), ప్రియాంకాచోప్రా(86), కత్రీనాకైఫ్(93) కూడా ఈ బాబితాలో చోటు దక్కించుకున్నారు.

మరిన్ని వార్తలు