‘కాలం చెల్లిన చట్టాలను ఇకనైనా సవరించండి’

24 Nov, 2018 19:47 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

లండన్‌ : కాలం చెల్లిన చట్టాలను సవరించి ఇకనైనా లింగ వివక్షకు చరమగీతం పాడాలని మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ యూరోపియన్‌ దేశాలకు విఙ్ఞప్తి చేసింది. మహిళల సమ్మతి లేకుండా వారి భర్తలు శృంగారం జరిపే క్రమంలో భౌతిక దాడులు, బెదిరింపులు ఉన్నపుడు మాత్రమే అత్యాచారంగా పరిగణిస్తే సరిపోదని అభిప్రాయపడింది. మహిళల అంగీకారం లేకుండా వారి శరీరంపై జరిగే ప్రతీ చర్యను అత్యాచారంగానే పరిగణించాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొంది. ఐర్లాండ్‌, యూకే, బెల్జియం, సైప్రస్‌, జర్మనీ, ఐస్‌లాండ్‌, లక్సెంబర్గ్‌, స్వీడన్‌ మొదలగు ఎనిమిది దేశాలు మాత్రమే సమ్మతిలేని శృంగారాన్ని అత్యాచారంగా పరిగణిస్తున్నాయని తెలిపింది. మరో 31 యూరోపియన్‌ దేశాలు మాత్రం ఈ విధానాల్ని పాటించడం లేదని వెల్లడించింది. అత్యాచారం అనే పదానికి నిర్వచనం మార్చినపుడు మాత్రమే బాధితులకు న్యాయం జరుగుతుందని అభిప్రాయపడింది. కాగా ‘ఎలిమినేషన్‌ ఆఫ్‌ వయొలెన్స్‌ అగెనెస్ట్‌ వుమన్‌’  దినోత్సవం సమీపిస్తున్న నేపథ్యంలో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ యూరోపియన్‌ దేశాలకు ఈ విఙ్ఞప్తి చేసింది

మీటూ లాంటి ఉద్యమాలు వచ్చిప్పటికీ...
‘మీటూ లాంటి ఉద్యమాల వల్ల చాలా మంది బాధితులు తాము ఎదుర్కొన్న వేధింపుల గురించి బయటపెడుతున్నారు. అయితే ఆ సమయంలో వారు అనుభవించిన బాధ కంటే కూడా... అప్పుడు ఏం జరిగిందో ఎలా జరిగిందో చెప్పు.. అసలు ఇదంతా నిజమేనా... ఒకవేళ నిజమే అయితే సాక్ష్యాలు చూపించు అనే ఈ మాటల వల్లే ఎక్కువ బాధను అనుభవిస్తున్నారు. ఇక్కడ విచారించదగ్గ మరో విషయం ఏంటంటే చాలా మంది యూరోప్‌ మహిళలు తమపై జరిగిన అత్యాచారాల గురించి నోరు మెదిపే ధైర్యం చేయలేకపోవడం’ అని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌, యూరోప్‌ మహిళా హక్కుల నేత అన్నా బ్లస్‌  ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు