ఈక్వెడార్ లో మళ్లీ భూకంపం

20 Apr, 2016 15:45 IST|Sakshi
ఈక్వెడార్ లో భూకంప విలయం(ఫైల్ ఫొటో)

క్విటో: నాలుగు రోజుల కందట సంభవించిన భారీ భూకంపానికి కకావికలమైన దక్షిణ అమెరికా ఖండ దేశం ఈక్వెడార్ లో మళ్లీ ప్రకంపనలు చెలరేగాయి. బుధవారం ఆ దేశ తీరప్రాంతం కేంద్రంగా మరో భూకంపం వచ్చింది. దీని తీవ్రత రిక్కర్ స్కేలుపై 6.1గా నమోదయింది. ప్రకంపనల ధాటికి తీర పట్టణాలన్నీ కంపించాయి. ముయిసె పట్టణానికి పశ్చిమంగా సముద్రంలో 15 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించిన్టుల అమెరికా భూగర్భ పరిశోధనా సంస్థ తెలిపింది.

 

ఈ నెల 16న ఈక్వెడార్‌ పసిఫిక్‌ తీర ప్రాంతంలో (7.8 పాయింట్ల తీవ్రతతో) ఏర్పడిన భూకంపం తీరప్రాంతనగరం గువాయాక్విల్‌ను శిధిలాల దిబ్బగామార్చింది. ఇప్పటివరకు అందిన సమాచారంమేరకు భూకంప మృతుల సంఖ్య 500కు చేరువలో ఉంది. ఇంకా శిథిలాలకింద వేల మంది చిక్కుకుని ఉంటారని అంచనా. ఓవైపు పెద్ద ఎత్తున సహాయక చర్యలు కొనసాగుతుండగానే మరో భూకంపం సంభవించడం అక్కడి ప్రజలు, అధికారులను కలవరపాటుకుగురిచేసింది. అయితే ఒక భారీ భూకంపం అనంతరం రెండు మూడు నెలలపాటు ప్రకంపనలు చోటుచేసుకోవటం సహజమేనని నిపుణులు అంటున్నారు. తాజా భూకంపం ఎలాంటి నష్టం చేసిందనే సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు