మెదడును తినేసే అమీబా!

21 Sep, 2013 01:40 IST|Sakshi

న్యూ ఆర్లాన్స్: అమెరికాలోని లూసియానా రాష్ట్రంలో ‘నేగ్లేరియా ఫోలెరీ’ అనే ప్రాణాంతక అమీబా తాగునీటిలో ప్రత్యక్షమై ప్రజలను, అధికారులను హడలెత్తిస్తోంది. న్యూ ఆర్లాన్స్ సమీపంలోని ఓ తాగునీటి సరఫరా కేంద్రంలోని శాంపిళ్లలోఈ అమీబా వెలుగుచూసింది. ముక్కు ద్వారా మాత్రమే మనిషి మెదడును చేరగలిగే ఈ పరాన్నజీవి మెదడును తినేస్తూ.. నరాలను కుళ్లబెట్టేస్తుందట. ఇది సంక్రమించిన ఏడు రోజులకు మెదడువాపు, తలనొప్పి, జ్వరం, వాంతులు, వికారం, మెడ బిగుసుకుపోవడం, మతిభ్రమించడం, మూర్ఛ వంటి లక్షణాలు కన్పిస్తాయి. 12 రోజుల్లోపే మరణం సంభవిస్తుంది. 1962 నుంచీ ఇప్పటిదాకా 132 మందికి ఈ అమీబా సోకగా.. ఇప్పటిదాకా బతికింది ముగ్గురేనని అధికారిక అంచనా. ఇది చాలా ప్రమాదకారి అయినందున సెయింట్ బెర్నార్డ్ పారిష్ ప్రాంతంలోని మంచి నీరు ఎవరూ వాడకూడదంటూ అధికారులు సూచనలు జారీ చేశారు. వేడినీటి బుగ్గల్లో ఉండే ఈ అమీబా తాగునీటిలో కనిపించడం ఇదే తొలిసారని అంటున్నారు.

>
మరిన్ని వార్తలు