-

32 వేల ఏళ్ల క్రితం చనిపోతే.. బతికించారు

18 Mar, 2017 09:13 IST|Sakshi

మరణించిన వారికి తిరిగి ప్రాణాలు పోసే పరిశోధనలు ప్రపంచలోనే కొద్ది చోట్ల జరుగుతున్నాయి. మన దేశంలో గతేడాది ఓ రాష్ట్ర ప్రభుత్వం ఆయుర్వేద గ్రంధాల్లో చెప్పిన సంజీవనిని కనుగొనడానికి కొంత మొత్తంలో నిధులను కూడా కేటాయించింది. చాలా ఏళ్ల క్రితం చనిపోయి ఇంకా మిగిలి ఉన్న జీవుల డీఎన్‌ఏ కణాలతో ప్రాణం ఉన్న జన్యువులను కలిపి బతికించే ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిశోధనలే నిర్వహిస్తున్న రష్యా ఆ దిశగా ముందడుగు వేసింది.

దాదాపు 32 వేల సంవత్సరాల క్రితం అంతరించిపోయిన ఓ మొక్కను తిరిగి భూమి మీద మొలకెత్తేలా చేసింది. దాని పేరు సైలిన్‌ స్టెలోఫిల్లా. సైబీరియాలోని ది ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సెల్ బయోఫిజిక్స్‌కు చెందిన శాస్త్రవేత్తలు పరిశోధనల కోసం కోలైమా నది పరివాహక ప్రాంతంలో చనిపోయిన జీవుల జన్యువుల కోసం అన్వేషిస్తున్నారు. ఈ సమయంలో నదికి దగ్గరలోని ఓ ప్రాంతంలో పరిశోధకుడికి మంచు దిబ్బల కింద ఓ ఉడుత తన ఆహారం కోసం దాచుకున్న చిన్న గింజ తారస పడింది.

గింజతో టెస్ట్‌ ల్యాబ్‌కు చేరుకున్న పరిశోధకులు అది 32 వేల సంవత్సరాల క్రితం జీవించిన సైలిన్‌ స్టెలోఫిల్లా అనే గడ్డి మొక్కకు చెందిన గింజగా గుర్తించారు. సైలిన్‌ స్టెలోఫిల్లా నేటి ప్రపంచంలో కూడా ఉంది. అయితే కాలాంతరంలో దాని జన్యువుల్లో భారీ మార్పులు జరిగాయి. దీంతో గింజను మొలకెత్తించి వేల ఏళ్ల క్రితం అంతరించిపోయిన మొక్కను తిరిగి మొలిపించాలని నిర్ణయించుకున్న పరిశోధకులు అందులో సఫలమయ్యారు. రష్యా శాస్త్రవేత్తలు సాధించిన విజయం మరణించిన జంతువుల జన్యువులను ప్రాణం ఉన్న డీఎన్‌ఏ జన్యువులతో కలిపి ఊపరిలూదే అవకాశం ఉందనే ఆశలను చిగురింపజేస్తోంది.

మరిన్ని వార్తలు