ఒకరు ఆలోచించారు...మరొకరు వీడియోగేమ్ ఆడారు!

11 Nov, 2014 01:34 IST|Sakshi
ఒకరు ఆలోచించారు...మరొకరు వీడియోగేమ్ ఆడారు!

వాషింగ్టన్: వారిద్దరూ అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ పరిశోధకులు. అరమైలు దూరంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నారు. ఒకరు కంప్యూటర్‌లో వీడియోగేమ్ చూస్తూ.. టార్గెట్లను ఎలా కాల్చాలో మనసులోనే ఆలోచించారు. మరో చోట ఉన్న వ్యక్తి మొదటి వ్యక్తి ఆలోచించిన విధంగానే వీడియోగేమ్‌లో టార్గెట్లను టపటపా కాల్చేశాడు!

మెదడు నుంచి మెదడుకు సమాచార ప్రసారంలో శాస్త్రవేత్తలు సాధించిన అద్భుత పురోగతి ఇది. అందునా.. యూనివర్సిటీకి చెందిన భారత సంతతి శాస్త్రవేత్త డాక్టర్ రాజేశ్ రావు ఈ ప్రయోగానికి నేతృత్వం వహించడం విశేషం. ఇంతకూ ఇదెలా జరిగిందంటే... రాజేశ్ రావు తన తలకు మెదడు సంకేతాలను చదివే ఎలక్ట్రో-ఎన్‌సెఫలోగ్రఫీ యంత్రాన్ని అమర్చుకున్నారు. అలాగే, చేతిని కదిలించే మెదడులోని ఎడమ మోటార్ కార్టెక్స్ భాగాన్ని ప్రేరేపించేందుకు అయస్కాంత అనుకరణ పరికరంతో కూడిన ఓ టోపీని వేరొకచోట ఉన్న సహ పరిశోధకుడు ఆండ్రియా స్టోకో ధరించారు.

తర్వాత రాజేశ్ రావు వీడియోగేమ్ చూస్తూ ఆలోచించగానే మెదడు సంకేతాలను చదివిన ఎలక్ట్రో-ఎన్‌సెఫలోగ్రఫీ యంత్రం ఆ సంకేతాలను ఇంటర్‌నెట్ ద్వారా నేరుగా స్టోకో తలకు అమర్చిన టోపీకి పంపింది. ఇంకేం.. జస్ట్ ఒక్క సెకను తేడాతోనే.. రాజేశ్ ఆలోచించినట్లుగానే కీబోర్డుపై స్టోకో చేతివేళ్లు కదిలి టార్గెట్లను కాల్చేశాయి. కాగా, మనుషులు మెలకువగా లేదా నిద్రలో ఉండేలా చేసేందుకు మెదడును నియంత్రించడంపైనా వీరు ప్రయోగాలు చేస్తున్నారు.

దీనివల్ల.. ఒక పైలట్ నిద్రలో జోగితే.. మరో పైలట్ అప్రమత్తంగా ఉండేలా చేసేందుకూ వీలవుతుందట. ఉపాధ్యాయుడి మెదడు నుంచి విద్యార్థికి నేరుగా పాఠాలను మార్పిడి చేసే ‘బ్రెయిన్ టూటరింగ్’ను సాధ్యం చేయడంపైనా తాము దృష్టిపెట్టినట్లు రాజేశ్ రావు వెల్లడించారు. వీరి పరిశోధన వివరాలు ‘ప్లాస్ వన్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
 

మరిన్ని వార్తలు