‘మరేం పర్లేదు.. బాగానే ఉన్నాను’

27 Jun, 2019 16:24 IST|Sakshi

బెర్లిన్‌ : జర్మనీ ఛాన్స్‌లర్‌ ఏంజెలా మార్కెల్‌ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. గురువారం జపాన్‌లోని ఒసాకాలో ప్రారంభమైన జీ 20 సమావేశాల్లో పాల్గొనేందుకు ఏంజెలా సిద్ధమయ్యారు. ఈ క్రమంలో విమానం ఎక్కడానికి కొన్ని గంటల ముందు జర్మనీ కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి ఆమె హాజరయ్యారు. ఈ వేడుకలో అధ్యక్షుడు ఫ్రాంక్‌ వాల్టెర్‌ పక్కన నిల్చున్న ఏంజెలా వణకడం ప్రారంభించారు. ఈ క్రమంలో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే ఆమె దగ్గరికి వచ్చి మంచినీళ్లు అందించబోయారు. కానీ ఏంజెలా సున్నితంగా వారి సహాయాన్ని నిరాకరించారు. కాసేపటి తర్వాత తనకు తానుగా నడుచుకుంటూ అక్కడి నుంచి ముందుకు కదిలారు.

కాగా గత మంగళవారం కూడా ఏంజెలా ఇలాగే అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఛాన్స్‌లర్‌ ఆరోగ్య విషయంలో ఆందోళన వ్యక్తమైన నేపథ్యంలో.. ఏంజెలా పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని ఆమె కార్యాలయ వర్గాలు తెలిపాయి. జీ 20 సమావేశంలో ఏంజెలా పాల్గొంటారని.. ఆమె పర్యటనలో ఎటువంటి మార్పులు ఉండబోవని స్పష్టం చేశాయి. కాగా ప్రపంచ దేశాల్లో అత్యంత శక్తిమంతమైన మహిళగా ఏంజెలా గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. అదే విధంగా యూరోపియన్‌ దేశాల్లో అత్యంత ప్రభావశీల నేతగా ఖ్యాతికెక్కిన ఏంజెలా.. 2021 వరకూ రాజకీయాల నుంచి వైదొలగుతానని ప్రకటించిన విషయం విదితమే. వయసు పైబడటమే కాకుండా ఆరోగ్యం కూడా సహకరించనందున ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆమె వెల్లడించారు. ఇక వచ్చే నెలలో ఆమె 65వ పడిలో అడుగుపెట్టనున్నారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా