కెమెరామెన్‌ను కొమ్ములతో కుమ్మేసింది!

7 Sep, 2019 10:51 IST|Sakshi

సాధారణ ఫొటోగ్రఫీ కంటే వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ కాస్త కష్టంతో కూడుకున్న వ్యవహారమే. వన్యప్రాణులను చిత్రీకరించే ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా చేదు అనుభవాలు ఎదుర్కోకతప్పదు. జంతువుల మూడ్‌పైనే వారి రక్షణ ఆధారపడుతుంది. సింహం, పులుల వంటి మృగాలతో పోలిస్తే శాకాహార జీవులతో కాస్త చనువుగా ఉన్నా పెద్దగా ప్రమాదమేమీ ఉండదు. అయితే నైరుతి ఇంగ్లండ్‌లోని వైల్ట్‌షైర్‌ జంతువుల పార్కులో ఉండే సిసిల్‌ అనే గొర్రె మాత్రం ఇందుకు మినహాయింపు. తనను వీడియోలో బంధించేందుకు వచ్చిన ఓ కెమెరామెన్‌ను కొమ్ములతో కుమ్మేసింది. చివరకు పార్కు నిర్వాహకులు కలుగజేసుకుని వెనక్కి పిలవడంతో శాంతించి..అతడిని వదిలేసింది.

‘సఫారీ పార్కుల్లో దాగున్న వన్యప్రాణుల జీవితంలోని దృశ్యాల ఆవిష్కరణ’ పేరిట బీబీసీ ఓ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా సోమవారం విల్ట్‌షైర్‌లోని పార్కులో వీడియోషూట్‌ చేసేందుకు బీబీసీ కెమెరామెన్‌ ఎంతో ఉత్సాహంగా వెళ్లాడు. అయితే ఆ పార్కులో రౌడీగా పేరొందిన సిసిల్‌ను పార్కు నిర్వాహకులు కెమెరామెన్‌కు పరిచయం చేశారు. తను చాలా మొండిదని, ఎవరైనా తనకు నచ్చని పనిచేస్తే వెంటనే వాళ్ల పనిపడుతుందని చెబుతుండగానే అది నెమ్మదిగా కెమెరామెన్‌ దగ్గరికి వెళ్లింది. వీడియో తీసేందుకు కెమెరా సెట్ చేసుకుంటున్న సమయంలో ఒక్కసారిగా అతడిపై కొమ్ములతో విరుచుకుపడింది. ఈ తతంగాన్నంతా పక్కనే ఉండి గమనిస్తున్న పార్కు సిబ్బంది మాత్రం ఇది షరామామూలే అన్నట్లుగా నవ్వుతుండటంతో కెమెరామెన్‌ బిక్కముఖం వేయాల్సి వచ్చింది.

కాగా ఇందుకు సంబంధించిన వీడియోను బీబీసీ సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా వైరల్‌గా మారింది. ఇక ఆఫ్రికాలో నివసించే అరుదైన రకానికి చెందిన ఈ గొర్రె చేష్టలు నెటిజన్లకు నవ్వు తెప్పిస్తున్నాయి. ‘మీ దగ్గర కెమెరా ఉంటే..దానికి పదునైన కొమ్ములు ఉన్నాయి. ఎంత కోపం వచ్చిందో అందుకే అలా కుమ్మింది’ అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు