విద్యార్థుల ఉద్యమానికి వణికిన ‘ఢాకా’

3 Aug, 2018 19:16 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘చట్టం అందరికి ఒక్కటే’ పేరిట బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో విద్యార్థులు చిత్రమైన ఉద్యమాన్ని చేపట్టారు. ఆదివారం నాడు జరిగిన ఓ బస్సు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మరణించడంతో కోపోద్రిక్తులైన విద్యార్థులు దీనికి శ్రీకారం చుట్టారు. పోలీసులు సవ్యంగా విధులు నిర్వహించక పోవడం వల్ల, అనుభవం లేని, డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేని వారు బస్సులు నడుపుతుండడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని భావించి వారు రోడ్డెక్కారు. వ్యవస్థను తామే మార్చాలని నిర్ణయించుకున్నారు. పోలీసుల విధులను వేరే చేపట్టారు.

ఎదురుపడిన ప్రతి వాహనాన్ని ఆపి డ్రైవింగ్‌ లైసెన్స్‌లు తనిఖీ చేస్తున్నారు. టూ వీలర్లపై, కార్లలో వచ్చిన పోలీసులను కూడా ఆపుతున్నారు. వారిలో చాలా మంది వద్ద డ్రైవింగ్‌ లైసెన్స్‌లు లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ‘మీరే చట్టాన్ని పాటించకపోతే ఇంకెవరు పాటిస్తారు?’ అంటూ వారిని విద్యార్థులు నిలదీస్తున్నారు. వారు క్షమాపణలు చెప్పినప్పటికీ ససేమిరా అంటూ వెనక్కి పంపిస్తున్నారు. రాంగ్‌ రూట్‌లో వచ్చిన ఓ మంత్రి కారునే ఆపి చాలా మర్యాదగా మాట్లాడుతూ వెనక్కి పంపించారు. బాలలు, బాలికలు తేడా లేకుండా స్కూల్‌ విద్యార్థులంతా యూనిఫారమ్‌లు ధరించి ఉద్యమంలో పాల్గొనడం ఓ విశేషమయితే. ఎక్కడా దౌర్జన్యానికి పాల్పడకుండా వీలైనంత వరకు మర్యాదగా వారు ఉద్యమాన్ని నడిపించడం విశేషం.

షాజహాన్‌ ఖాన్‌ అనే ఓ మంత్రి చేసిన వ్యాఖ్యలు విద్యార్థుల ఉద్యమానికి ఆజ్యం పోశాయి. గత ఆదివారం నాడే భారత్‌లోని మహారాష్ట్రలో జరిగిన ఓ బస్సు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మరణించారని, అక్కడ ఎలాంటి ఉద్యమం లేదు, ఇక్కడ ఎందుకు ఉద్యమం నడిపిస్తున్నారో తనకు అర్థం కావడం లేదంటూ ఓ టీవీ ఇంటర్వ్యూలో సదరు మంత్రి నవ్వుతూ వ్యాఖ్యానించడం విద్యార్థులకు కోపం తెప్పించింది. విద్యార్థుల ఉద్యమానికి ‘ఫేస్‌బుక్‌’ ఎంతో తోడ్పడుతోంది. విద్యార్థులు తాము చేస్తున్న ఉద్యమాన్ని ఎక్కడిక్కడ వీడియోలు తీస్తూ ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో ఎక్కడికక్కడ విద్యార్థులు స్వచ్ఛందంగా ఉద్యమంలోకి వచ్చారు. పోలీసులు ప్రజల నుంచి లంచాలు తీసుకుంటున్నారని, దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపిస్తూ ఎప్పటివో పాత ఫొటోలను కూడా షేర్‌ చేయడం కాస్త విచారకరం.ఢాకాలో ప్రారంభమైన ఈ ఉద్యమం దేశంలోని పలు నగరాలకు విస్తరించింది. విద్యార్థులకు భయపడి పోలీసులు, అధికారులు, ఉద్యోగులు డ్రైవింగ్‌ లైసెన్స్‌లు లేకుండా బండ్లు తీయడం లేదు. సిగ్నల్‌ వ్యవస్థను కూడా బుద్ధిగా పాటిస్తున్నారు. తాము కూడా ఉద్యమాన్ని ఇంతకు మించి ముందుకు తీసుకపోలేమని, విద్యార్థులుగా చదువుకోవాల్సిన బాధ్యత తమపై కూడా ఉందన్నారు.

విద్యార్థుల్లో ఉద్యమం పట్ల ఇంత స్ఫూర్తి రావడానికి మరో కారణం ఉంది. గత ఏప్రిల్‌ నెలల్లోనే కోటా అంటే రిజర్వేషన్ల వ్యవస్థకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించి విజయం సాధించారు. భారత్‌లో లాగా అక్కడ కులాల ప్రాతిపదికన రిజర్వేషన్లు లేవు. 1971లో జరిగిన విముక్తి యుద్ధంలో పాల్గొన్న వారి వారసులకు రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి. విద్యార్థుల ఉద్యమానికి దిగొచ్చిన బంగ్లా ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుంచే రిజర్వేషన్ల విధానాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. విద్యార్థులే కాకుండా బంగ్లాదేశ్‌ యువత కూడా ఉద్యమాల్లో ముందే ఉంటుంది. 1971 విముక్తి యుద్ధానికి ద్రోహం చేసిన వారికి ఉరిశిక్ష విధించాలని, దేశంలోనే అతిపెద్ద మత పార్టీ అయిన ‘జమాత్‌–ఏ–ఇస్లామ్‌’ పార్టీని నిషేధించాలంటూ ఉద్యమాలు నడిపి యువత విజయం సాధించింది.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా