పిల్లల కంటే జంతువులే మక్కువ

4 Jun, 2015 10:30 IST|Sakshi
పిల్లల కంటే జంతువులే మక్కువ

పెంపకంలో మాత్రం నిర్లక్ష్యం
 
రియో డి జనేరియో: మూగజీవాలంటే దక్షిణా అమెరికా దేశం బ్రెజిల్ వాసులు తగని మక్కువ. అందుకే ఇక్కడ చిన్న పిల్లల సంఖ్య కంటే పెంపుడు జంతువుల సంఖ్యే అధికమని తేలింది. బ్రెజిల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జియోగ్రఫీ అండ్ స్టాటిస్టిక్స్ (ఐబీజీఈ) మంగళవారం విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని ప్రకటించింది. బ్రెజిల్‌లో పెంపుడు శునకాల సంఖ్య 5.22 కోట్లు కాగా, 0-14 ఏళ్ల మధ్య వయసున్న బాలల సంఖ్య 4.49 కోట్లు మాత్రమే. అంటే బాలల కంటే శునకాల సంఖ్య ఏడుశాతం ఎక్కువ. ఈ దేశంలోని 44.3 శాతం ఇళ్లలో శునకాలు ఉన్నాయని అధ్యయనంలో తేలింది.

ఒక్కో ఇంట్లో సగటున 1.8 కుక్కలు ఉన్నాయని ఐబీజీఈ నివేదిక వివరించింది. ఇక్కడి వాళ్లు పిల్లుల పెంపకంపై పెద్దగా శ్రద్ధ చూపనప్పటికీ, వీటి సంఖ్య కూడా తక్కువేమీ లేదు. దేశవ్యాప్తంగా 17.7 శాతం కుటుంబాలు పిల్లులను పెంచుకుంటున్నాయి.  పరానా రాష్ట్రంలో అత్యధికంగా 60 శాతం ఇళ్లలో కనీసం ఒక మూగజీవి ఉన్నట్టు వెల్లడయింది. రాజధాని బ్రెజీలియాలోని సమాఖ్య జిల్లాలో మాత్రం అతి తక్కువగా 32.3 శాతం మంది మాత్రమే జంతువులను సాకుతున్నట్టు వెల్లడయింది. బ్రెజిల్ వాసుల్లో అత్యధికులు మూగజీవాలను పెంచుకున్నప్పటికీ, వాటిని సాకడంలో నిర్లక్ష్యం వహిస్తుంటారు. జంతువుల యజమానుల్లో 75.4 శాతం మంది మాత్రమే వాటికి రేబిస్ టీకాలు వేయించారు. నిబంధనల ప్రకారం పెంపుడు కుక్కలకు ఏటా రేబిస్ టీకాలు వేయించడం తప్పనిసరి. ఈ విషయమై అవగాహన పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటుంది.

ఇంగ్లండ్..
బ్రిటిషర్లు కూడా జంతువుల పెంపకంపై ఆమితాసక్తి చూపిస్తున్నారు. ఇక్కడ 24 శాతం ఇళ్లలో 90 లక్షల పెంపుడు శునకాలు ఉన్నాయి. దాదాపు 18 శాతం ఇళ్లలో 79 లక్షల పిల్లులు ఉన్నాయి. ఆక్వేరియాలు, ట్యాంకుల్లో 2.5 కోట్ల చేపలను పెంచుతున్నారు. బ్రిటిషర్లలో 2.4 శాతం మంది 10 లక్షల కుందేళ్లను, 1.4 శాతం మంది పక్షులు, 0.5 శాతం మంది  నాలుగు లక్షల పాములను పెంచుతున్నారు. కేవలం 1.1 శాతం మంది ఐదు లక్షల గినియా పందులను పెంచుకుంటున్నారు. జనాభాలో 0.7 శాతం మంది నాలుగు లక్షల బల్లులను కూడా పెంచుతున్నారు. గుర్రాలు, పావురాలు, తాబేళ్లు, కప్పలు, ఎలుకలు, పురుగులనూ పెంచుకునేవారు కూడా ఉన్నారు.
 
అమెరికాలో...
2012లో నిర్వహించిన అధ్యయనం ప్రకారం అగ్రరాజ్యం అమెరికాలో 8.33 కోట్ల పెంపుడు శునకాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 47 శాతం ఇళ్లలో కనీసం ఒక్క శునకమైనా కనిపిస్తుంది.  కనీసం ఒక్క పెంపుడు జంతువునైనా సాకేవారి సంఖ్య 70 శాతం నమోదయింది. పది శాతం మందికి మూడు లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలో కుక్కలు ఉన్నాయి. ఇక పిల్లుల విషయానికి వస్తే అమెరికాలో వీటి సంఖ్య 95.6 కోట్ల వరకు ఉంది. ఒక్క పిల్లినైనా పెంచుకునే వారి సంఖ్య 46 శాతం ఉంది. దేశవ్యాప్తంగా 3,500 జంతు వసతి కేంద్రాలు ఉన్నాయి. వీటిలో ఏటా 80 లక్షల పిల్లలు, కుక్కలకు ఆశ్రయం కల్పిస్తున్నారు.

మరిన్ని వార్తలు