21 ఏళ్లకే ఎంతటి సాహసం!

30 Dec, 2019 16:02 IST|Sakshi

న్యూఢిల్లీ : కొందరికి ప్రమాదాలతో చెలగాటమంటే ఇష్టం. మరికొందరికి అత్యంత ప్రమాదరకరమైన అత్యున్నత పర్వత శ్రేణులను అధిగమించి కీర్తి కిరీటాలను సాధించడం అంటే ఇష్టం. రెండవ కోవకు చెందిన బ్రిటిష్‌ పౌరురాలు, 21 ఏళ్ల అన్నా టేలర్, సరికొత్త రికార్డును సాధించారు. గయానా దేశంలో విష సర్పాలకు, విష సాలె పురుగులకు, తేళ్లకు ప్రమాదకరమైన నీటి కాల్వలు, నీటి గుంటలకు నిలయమైన రెయిన్‌ ఫారెస్ట్‌లోని నిట్ట నిలువుగా రెండువేల అడుగుల ఎత్తైన రొరైమా పర్వతాన్ని అధిరోహించారు. తద్వారా ప్రపంచంలోనే ఈ పర్వతాన్ని అధిరోహించినా తొలి మహిళగా రికార్డు సృష్టించారు.

బ్రిటన్‌ లియో హోల్డింగ్‌ అనే 39 ఏళ్ల యువకుడి నాయకత్వాన మొత్తం ఆరుగురి బృందంలో ఒకరిగా టేలర్‌ ఈ పర్వతాన్ని అధిరోహించారు. ఆరుగురిలో ఆమె పిన్న వయస్కురాలు. విష సర్పాలు, విష పురుగులతోపాటు కోసుకుపోయే రాళ్లు, ప్రమాదకరమైన కాల్వలను దాటుకుంటూ 33 మైళ్లు దట్టమైన అడవిలో నడుచుకుంటూ, అంతే ప్రమాదకరమైన వాటర్‌ ఫాల్స్‌ను అధిరోహిస్తూ గమ్యస్థానాన్ని చేరుకోవడానికి దాదాపు నెల రోజులపాటు పట్టినట్లు ఆ సాహస బృందం తెలిపింది. పర్వతారోహణకు కేవలం తాళ్లు, కొక్కాలను మాత్రమే ఉపయోగించామని, అక్కడక్కడ విశ్రాంతి కోసం కొక్కాలకు వేలాడే టెంటులను ఉపయోగించినట్లు వారు తెలిపారు.

పర్వత శిఖరాన తొమ్మిదివేల అడుగుల వైశాల్యం కలిగిన ఈ పర్వతం ‘ది లాస్ట్‌ వరల్డ్‌’ పుస్తకం రాయడానికి సర్‌ ఆర్థర్‌ కానన్‌ డోయల్‌కు స్ఫూర్తినిచ్చింది. డైనోసార్లకు సంబంధించిన ఈ నవలను హాలివుడ్‌ చిత్రంగా తీసిన విషయం తెల్సిందే.

మరిన్ని వార్తలు