దావోస్ సదస్సుకు టికెట్ కొనాల్సిందే!

21 Jan, 2017 22:54 IST|Sakshi
దావోస్ సదస్సుకు టికెట్ కొనాల్సిందే!

స్విట్జర్లాండ్‌లోని పర్యాటక కేంద్రమైన దావోస్‌లో ఏటా జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు హాజరవ్వాలంటే ముందస్తు ఆహ్వానం తప్పనిసరి. ప్రపంచంలోని 100కు పైగా దేశాల నుంచి 2,500 మంది ప్రతినిధులు హాజరవుతారు. బడా బడా కార్పొరేట్‌ సంస్థల సీఈఓలు, ప్రతినిధులు, జీ20 తదితర కీలక దేశాల ప్రభుత్వాధినేతలు, ముఖ్యమైన రాజకీయ నాయకులు, సాంకేతిక రంగ ప్రముఖులు, సామాజిక వేత్తలు, సామాజిక సంస్థలు, మీడియా సంస్థల ప్రతినిధులు వీరిలో ఉంటారు. ప్రభుత్వాధినేతలు, మత పెద్దలు, విద్యావేత్తలు, సామాజికవేత్తలు, అంతర్జాతీయ సంస్థల సభ్యులు, వార్తా చానళ్ల ప్రతినిధులు వంటి కొందరు ఆహ్వానితులకు తెల్ల బ్యాడ్జీలు ఇస్తారు. అవి ఉచితం. వాణిజ్యపరంగా హాజరయ్యే వారు మాత్రం ప్రవేశ టికెట్‌ ‘కొనుగోలు’ చేయాల్సిందే. ఒక టికెట్‌ ధర సుమారు రూ. 15 లక్షల రూపాయలు ఉంటుంది.

ఒక వ్యక్తికి టికెట్‌.. రూ. 50 లక్షలు..: దావోస్‌ సదస్సుకు టికెట్‌ కావాలంటే ముందుగా ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సభ్యత్వం ఉండాలి. ఆ సభ్యత్వం కోసం సుమారు రూ. 36 లక్షలు కట్టాలి. ఇక సదస్సుకు హాజరవడానికి అదనంగా రూ. 14 లక్షలు పెట్టి టికెట్ కొనుక్కోవాలి. అంటే.. మొత్తం రూ. 50 లక్షలు ఖర్చు పెడితే  ఒక వ్యక్తి దావోస్‌ సదస్సుకు హాజరయ్యే అర్హత సాధిస్తారు. సదస్సులో కీలకమైన ప్రయివేటు పారిశ్రామిక సమావేశాలకు హాజరవ్వాలంటే.. ‘ఇండస్ట్రీ అసోసియేట్‌’ హోదా పొందాలి. అందుకోసం ఏడాదికి కోటి రూపాయలు ఫీజు కట్టాలి. సదస్సుకు ఒక వ్యక్తి కాకుండా అదనంగా మరో వ్యక్తి హాజరవ్వాలంటే.. ‘ఇండస్ట్రీ పార్టనర్‌’ సభ్యత్వం ఉండాలి. అందుకోసం దాదాపు రెండు కోట్ల రూపాయల వార్షిక ఫీజు చెల్లించాలి. అప్పుడు ఇద్దరు ప్రతినిధుల కోసం రెండు టికెట్లు (ఒక్కొక్కటి రూ. 14 లక్షలు చొప్పున) కొనుక్కోవచ్చు.

ఐదుగురికి టికెట్లు కావాలంటే.. 4.50 కోట్లు..: ఇద్దరికన్నా ఎక్కువ.. గరిష్టంగా ఐదుగురు ప్రతినిధుల బృందం హాజరవ్వాలంటే.. ‘వ్యూహాత్మక భాగస్వామి’ సభ్యత్వం పొందాలి. అందుకు దాదాపు రూ. 4 కోట్లు వార్షిక ఫీజు చెల్లించాలి. అప్పుడు ఐదుగురు సభ్యుల కోసం.. ఒక్కోటి రూ. 14 లక్షలు చొప్పున ఐదు టికెట్లు కొనుక్కోవచ్చు. అంటే.. ఐదుగురు సభ్యుల బృందం ఈ సదస్సుకు హాజరవ్వాలంటే దాదాపు రూ. 4.50 కోట్లు వ్యయం అవుతుంది. అలాగే.. ఐదుగురు సభ్యుల బృందంలో కనీసం ఒక మహిళా ప్రతినిధి అయినా ఉండాలి. అంతేకాదు.. ‘వ్యూహాత్మక భాగస్వామి’ సభ్యత్వం కావాలంటే.. ప్రపంచంలోని 250 అతి పెద్ద కంపెనీల్లో ఒకటిగా ఉండటంతో పాటు.. ఆ కంపెనీ చైనా లేదా ఇండియాలో ఉండాలి. ఈ సదస్సులో ఒక పార్టీ ఇవ్వాలంటే ఒక్కో అతిథి కోసం కనీసం రూ. 15,000 చొప్పున ఖర్చు చేయాలి. ఇక సదస్సుకు హాజరవ్వాలంటే.. దావోస్‌ ప్రయాణానికి, అక్కడ బస చేయడానికి ఒక్కో ప్రతినిధికి కనీసం రూ. 30 లక్షలు ఖర్చవుతుంది. ఇక చంద్రబాబు బృందం ప్రత్యేక విమానంలో దావోస్‌ వెళ్లినందుకు కోట్ల రూపాయల్లో ఖర్చయింది. దీనినిబట్టి.. దావోస్‌ సదస్సుకు హాజరవ్వాలంటూ ప్రత్యేక ఆహ్వానం అన్నది బూటకమేనని స్పష్టమవుతోంది.

మరిన్ని వార్తలు