అమెరికాలో మరో నల్ల జాతీయుడి నరహత్య

10 Jun, 2020 13:55 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికా పోలీసుల చేతిలో దారుణ నరహత్యకు గురయిన జార్జ్‌ ఫ్లాయిడ్‌ ఘటన మరవక ముందే అలాంటి సంఘటన మరోకటి వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతుంది. ఏ అండ్‌ ఈ నెట్‌వర్క్‌లో వచ్చే రియల్ టైమ్ పోలీస్ షో ‘లైవ్ పీడీ’ కోసం పోలీసులు ఈ వీడియోను ఏడాది క్రితం చిత్రీకరించారు.  ఈ ఘటనలో మరో నల్ల జాతీయుడు మరణించాడు. జార్జ్‌ ఫ్లాయిడ్‌ మరణం తర్వాత ఈ వీడియో, ఇందుకు సంబంధించిన నివేదిక వెలుగులోకి వచ్చింది. టెక్సాస్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ క్రింద ఈ నివేదిక వెల్లడయ్యింది.

వివరాలు.. జావియర్‌ అంబ్లెయర్‌ అనే వ్యక్తి స్నేహితులతో కలిసి పోకర్‌ ఆడి ఇంటికి వెళ్తుండగా విలియమ్సన్ కౌంటీ డిప్యూటీ జేజే జాన్సన్ అతడిని అడ్డగించాడు. అంబ్లర్‌ హెడ్‌లైట్స్‌ అధికంగా ఫోకస్‌ చేస్తున్నాడని ఆరోపించాడు. జాన్సన్ తన తుపాకీని గీసి, అంబ్లర్‌ను తన కారు నుంచి దిగమని డిమాండ్ చేశాడు. దాంతో అతను కారు బయటకు వచ్చి చేతులు పైకి లేపి నిలబడ్డాడు. ఆ తర్వాత అంబ్లర్‌ తన కారు వద్దకు వెళ్లడానికి ప్రయత్నిస్తుండగా.. జాన్సన్‌ టేజర్‌తో అతడిని కింద పడేస్తాడు. దాంతో అంబ్లర్‌ మోకాలి మీద నిల్చుని పైకి లేచేందుకు ప్రయత్నిస్తాడు. 

ఈలోపు వైట్ విలియమ్సన్ కౌంటీ షెరీఫ్ డిప్యూటీ తన “లైవ్ పీడీ” సిబ్బందితో వచ్చి టేజర్‌ను అంబ్లర్‌ వీపుకు గురి పెడతాడు. ఇద్దరి మధ్య చిన్న పొరాటం లాంటి జరుగుతుండగా మరో ఆస్టిన్ పోలీసు అధికారి ఒకరు సంఘటన స్థలానికి వచ్చి అంబ్లర్‌కు హ్యాండ్‌కఫ్స్‌ వేస్తాడు. తనను వదిలివేయాల్సిందిగా అంబ్లర్‌ వేడుకోవడం వీడియోలో వినవచ్చు. ‘సార్‌ నేను మీరు చెప్పినట్లు చేయగలను. కానీ నా గుండె చాలా బలహీనంగా ఉంది. అందుకే మీరు చెప్పినట్లు చేయలేకపోతున్నాను. నేను మిమ్మల్ని వ్యతిరేకించడం లేదు. సార్‌ నాకు ఊపిరి ఆడటం లేదు. దయచేసి.. దయచేసి నన్ను వదిలి పెట్టండి. నన్ను కాపాడండి’ అని వేడుకుంటాడు అంబ్లర్‌. పోలీసులు మేం చేప్పినట్లు చేయాలని డిమాండ్‌ చేస్తారు. అందుకు అంబ్లర్‌ తాను అలా చేయలేనని చెబుతూ ప్రాణం వదులుతాడు. చేతులు వేళ్లాడేస్తాడు. (ఆగని ఆందోళనలు)

ఈ లోపు అధికారి మరోసారి టేజర్‌తో కాల్పులు జరుపుతాడు. అంబ్లర్‌ స్పృహ తప్పిపోవడం గమనించిన పోలీసులు అతడిని ఆస్పత్రికి తీసుకెళ్తారు. వైద్యులు అంబ్లర్‌ అప్పటికే మరణించాడని తెలిపారు. గుండెకు రక్త ప్రసరణ ఆగిపోవడం వల్లే అతడు మరణించినట్లు నివేదిక వెల్లడించింది. స్టేట్ అటార్నీ జనరల్ కార్యాలయానికి చేసిన నివేదిక ప్రకారం అంబ్లర్‌ది నరహత్యగా పేర్కొంది. పోస్టు మార్టమ్‌ నివేదికలో గుండెకు రక్తప్రసరణ ఆగిపోవడం, రక్తపోటు హృదయ సంబంధ వ్యాధులతో అంబ్లర్‌ మరణించాడని వెల్లడించింది. (‘అతడు ఈ ప్రపంచాన్ని మార్చబోతున్నాడు’)

మరిన్ని వార్తలు