పాక్‌లో మరో హిందూ బాలిక కిడ్నాప్‌

27 Mar, 2019 12:00 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌లో ఇద్దరు హిందూ బాలికల కిడ్నాప్‌, మత మార్పిడి వివాదం కొనసాగుతుండగానే మరో హిందూ బాలిక అపహరణ కలకలం రేపుతోంది. పాక్‌లోని ఘోట్కికి చెందిన ఓ హిందూ వ్యక్తి తన కూతురుని గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్‌ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మార్చి 16న నలుగురు వ్యక్తులు అర్ధరాత్రి తమ ఇంట్లో చొరబడ్డారని, 16 ఏళ్ల తన కూతురిని లాక్కెళ్లిపోయారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బయట పార్కు చేసి ఉన్న వాహనంలో ఆమెను ఎక్కించుకుని ఎక్కడికో తీసుకెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

ఈ విషయంపై స్పందించిన సింధ్‌ ప్రావిన్స్‌ మైనార్టీ వ్యవహారాల మంత్రి హరి రామ్‌ కిషోరి లాల్‌.. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని పేర్కొన్నారు. ఈ కేసును లోతుగా దర్యాప్తు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. కాగా పాక్‌లోని ఘోట్కి జిల్లాలో హోలీ సందర్భంగా రవీనా (13), రీనా (15) అనే హిందు బాలికలను ఇంటి నుంచి అపహరించిన కొందరు.. తర్వాత వారికి ఓ ముస్లిం మత గురువు చేతుల మీదుగా మత మార్పిడి చేసి నిఖా నిర్వహించిన వీడియో ఆ దేశవ్యాప్తంగా వైరల్‌ కావడంతో ఆందోళనలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ నిర్వహించి తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఆదేశించారు. పూర్తి వివరాలను బయటపెట్టాల్సిందిగా సింధ్, పంజాబ్‌ ప్రభుత్వాలను ఆదేశాలు జారీ చేశారు.

ఇక ఈ ఘటన గురించి కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్, పాక్‌ మంత్రి ఫవాద్‌ చౌద్రీల మధ్య ఆదివారం ట్విటర్‌లో మాటల యుద్ధం జరిగింది. ఫవాద్‌ చౌద్రీ స్పందిస్తూ.. ‘ఇది పాక్‌ అంతర్గత విషయం. మైనారిటీలను అణచివేయడానికి ఇదేం భారత్‌లోని మోదీ ప్రభుత్వం కాదు. ఇది ఇమ్రాన్‌ఖాన్‌ పాలనలోని కొత్త పాక్‌. మా జెండాలోని తెల్లరంగులా మేము వారిని సమానంగా చూసుకుంటాం. ఇదే శ్రద్ధని భారత్‌లోని మైనారిటీల విషయంలోనూ చూపిస్తారని ఆశిస్తున్నాం.’అని ట్వీట్‌ చేశారు. దీనికి ప్రతిగా సుష్మ స్పందిస్తూ.. ‘ఈ విషాదకర ఘటనపై మీ స్పందన చూస్తుంటే మీలోని దోషపూరిత మనస్తత్వాన్ని బయటపెడుతోంది..’అని ట్వీట్‌లో బదులిచ్చారు.

మరిన్ని వార్తలు