పథకం ప్రకారమే కొలిమి రూపొందించారు!

4 Mar, 2019 14:33 IST|Sakshi

ఖతార్‌ : అమెరికాలో జర్నలిస్టుగా పని చేసిన సౌదీ జాతీయుడు జమాల్‌ ఖషొగ్గీని అత్యంత దారుణంగా హతమార్చారని ఖతార్‌కు చెందిన న్యూస్‌ ఏజెన్సీ ఆల్‌ జజీరా పేర్కొంది. ఖషోగ్గీ హత్య జరిగిన తర్వాత అతడి శవాన్ని ముక్కలు చేసి.. సౌదీ కాన్సులేట్‌ జనరల్‌ ఇంటికి తరలించారని వెల్లడించింది. అనంతరం అక్కడ ఉన్న భారీ కొలిమిలో వేసి మండించినట్లు తమ విచారణలో తేలిందని తెలిపింది. ఈ విషయం గురించి కొలిమిని నిర్మించిన వ్యక్తి మాట్లాడుతూ.. వెయ్యి డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతా సామర్థ్యం కలిగిన కొలిమి రూపొందించాలని సౌదీ కాన్సుల్‌ తనను ఆదేశించినట్లు అతడు చెప్పాడని ఆల్‌ జరీరా పేర్కొంది. అంతేకాకుండా సౌదీ కాన్సుల్‌ ఆఫీస్‌ గోడలపై ఖషోగ్గీ రక్తపు మరకలు కూడా ఉన్నాయని తెలిపింది. దీంతో ఖషోగ్గీ హత్యోదంతం మరోసారి చర్చనీయాంశమైంది.

కాగా సౌదీకి చెందిన జమాల్‌ ఖషోగ్గీ... సౌదీ యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ విధానాలను విమర్శిస్తూ వాషింగ్టన్‌ పోస్ట్‌లో కథనాలు రాసేవారు. ఈ క్రమంలో గతేడాది అక్టోబరు 2న ఆయన హత్యకు గురయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఈ ఘటనతో సౌదీ యువరాజు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ ఆదేశాలతోనే వాషింగ్టన్‌ పోస్ట్‌ జర్నలిస్ట్‌ ఖషోగ్గీని సౌదీ అధికారులు హత్యచేశారని గట్టిగా విశ్వసిస్తున్నట్లు అమెరికా నిఘా సంస్థ సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ (సీఐఏ) తెలిపింది. అయితే ఈ హత్యకు సంబంధించిన మిస్టరీ మాత్రం ఇంతవరకు వీడలేదు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు