సౌదీలో మరో మహిళ కష్టాలు, నరకం చూస్తున్నానంటూ..

11 Nov, 2017 09:32 IST|Sakshi

సౌదీ అరేబియాలో భారతీయ మహిళలు అష్టకష్టాలు పడుతున్నారు. పొట్టకూటి కోసం వెళ్లిన వారిని నరకయాతన చూపుతున్నారు. కొన్ని రోజుల క్రితమే గుర్బక్ష్ కౌర్‌ను సౌదీ అరాచకుల చేతుల్లోంచి కాపాడి, భారత్‌కు తీసుకువచ్చిన తర్వాత మరో పంజాబి మహిళ కూడా ఇవే కష్టాలు పడుతున్నానంటూ తన గోడును వెల్లుబుచ్చుకుంది. వాట్సాప్‌ ద్వారా తన బాధలను భారత్‌కు చేరవేసింది. సౌదీలో నరకం చూస్తున్నానంటూ... కేంద్ర ప్రభుత్వం తనను రక్షించాలంటూ అభ్యర్థించింది. శుక్రవారం ఈమె మూడు వాట్సాప్‌ వీడియోలను పంపింది. కేంద్రం, ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీ భగవత్‌ మాన్‌ తనను రక్షించాలంటూ వేడుకుంది. తాను చాలా దుర్భర జీవితం అనుభవిస్తున్నానని, తన యజమాని గత నాలుగు నెలలుగా శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నట్టు ఆరోపించింది.

మూడు వీడియోల్లో తాను అనుభవిస్తున్న నరకాన్ని చెబుతూ కన్నీరుమున్నీరైంది. ''నా జీవితం నరకంలో ఉన్నట్టు ఉంది. అర్థరాత్రి రెండు గంటలకు ముందు వరకు నేను పడుకోవడానికి వీలులేదు. గొడ్డు చాకిరి చేయాల్సి వస్తోంది. భగవత్‌ మాన్‌జీ నన్ను కాపాడండి ప్లీజ్‌. లేదా నేను ఇక్కడ చచ్చిపోవాల్సి వస్తుంది.  నన్ను నా యజమాని హింసిస్తున్నాడు'' అని పేర్కొంది. ఉచిత నివాసం, నెల నెల వేతనం ఇస్తామంటూ నాలుగు నెలల క్రితం తన భార్యను న్యూఢిల్లీకి చెందిన ఓ ట్రావెల్‌ ఏజెంట్‌ సౌదీ పంపించాడంటూ బాధితురాలి భర్త చెప్పాడు. గత మూడు నెలలుగా తన భార్య ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ వస్తుందంటూ ఆవేదన వ్యక్తంచేశాడు. తన భార్యను ట్రాప్‌ చేశారని గోడును వెల్లబుచ్చుకున్నాడు. 
 

మరిన్ని వార్తలు