చీమల పుట్టలతో... పుడమికి చల్లదనం!

6 Aug, 2014 03:33 IST|Sakshi
చీమల పుట్టలతో... పుడమికి చల్లదనం!

పిపీలికాల గురించి మీకేం తెలుసు? కష్టజీవులు.. క్రమశిక్షణతో కూడిన సంఘజీవులు.. వాటిని చూసి మనం ఎంతో నేర్చుకోవచ్చు.. ఇంకా? వాటిని డిస్ట్రబ్ చేస్తే మాత్రం చటుక్కున చిటుక్కుమనిపించి మంట పుట్టిస్తాయి. అప్పుడు మనకు చిరాకు పుట్టి చేతితో లేదా కాలితో నలిపేస్తాం కూడా. ఇంకా..? కొన్ని దేశాల్లో ఆహారంగా పనికొస్తాయి. మందుల తయారీకీ వాడతారట. అంతేనా? అయితే వీటి గురించి ఆశ్చర్యకరమైన ఓ కొత్త సంగతి గురించి తెలుసుకుందాం. అదేంటంటే.. చీమలు భూగోళానికి చల్లదనాన్ని కూడా ఇస్తాయట! భూతాపోన్నతి(గ్లోబల్ వార్మింగ్)ని తగ్గించేందుకు ఇవి పరోక్షంగా తమ వంతు సాయం చేస్తాయట. 

ఇవి కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలను విచ్ఛిన్నం చేసి సున్నపురాయిగా స్రవిస్తాయట. ఈ ప్రక్రియలో వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ ఈ సున్నపురాయిలో నిక్షిప్తం అయిపోతుందట. అందువల్ల వాతావరణంలో నుంచి కొంత కార్బన్‌డయాక్సైడ్ తగ్గి, తద్వారా భూతాపోన్నతీ తగ్గుతుందన్నమాట. అదేవిధంగా చీమలు మట్టి, ఇసుక రేణువులను నోటితో కరుచుకుని తెచ్చి గోడలకు అతికిస్తూ పుట్టలను పటిష్టంగా నిర్మిస్తాయన్నది తెలిసిందే. అయితే అవి ఇసుక రేణువులను నోటితో నాకి గోడకు అతికించేటప్పుడు కూడా వాటిలో మార్పులు జరిగి కార్బన్‌డయాక్సైడ్ నిక్షిప్తం అవుతుందట. మామూలు ఇసుక కన్నా.. బసాల్ట్ ఇసుక రేణువులు దొరికితే ఇవి 50-300 రెట్లు వేగంగా విచ్ఛిన్నం చేసేస్తాయట. కానీ ఇంత పెద్దభూగోళానికి చీమలు చేసే సాయం చాలా చిన్నదేనని, అయినా వీటి కృషిని తక్కువచేసి చూడరాదంటున్నారు ఈ సంగతిని కనిపెట్టిన అరిజోనా స్టేట్ యూనివర్సిటీ పరిశోధకుడు రోనాల్డ్ డార్న్.
 

మరిన్ని వార్తలు