మరి ఆ నీళ్లు ఎక్కడి నుంచి వచ్చినట్లు..!

3 Nov, 2015 09:13 IST|Sakshi

అక్కడ మంచు పెరుగుతోంది:నాసా


గ్లోబల్ వార్మింగ్ పై గగ్గోలు పెట్టేవారు.. భూమికి వచ్చే ప్రమాదాల్లో మొదట చెప్పే ఉదాహరణ.. దృవాల వద్ద కరుగుతున్న మంచు, పెరుగుతున్న సముద్ర మట్టాలు. అయితే వీరికి సమాధానం కాదు కానీ.. ధృవాల వద్ద మంచు కరగటం లేదని నాసా తేల్చేసింది. పై పెచ్చు.. పెరుగుతోందట. ముఖ్యంగా అంటార్కిటికా ఖండంలో భారీగా మంచు నిల్వలు పేరుకుంటున్నాయని నాసా పరిశోధనలు స్పష్టం చేశాయి.

నాసాకి చెందిన ఐస్, క్లౌడ్, అండ్ ల్యాండ్ ఎలివేషన్ శాటిలైట్ (ICESat) రాడార్ అల్టీ మీటర్ సాయంతో అంటార్కిటికా వద్ద మంచు పరిమాణం లెక్కగట్టినట్లు నాసా స్పేస్ సెంటర్ గ్లాసియోలజిస్ట్ జే జ్వాలీ వివరించారు. అంటార్కిటికా వద్ద పెద్ద మొత్తంలో మంచు పోగు పడుతోందని ఆయన అన్నారు. 2013లో ఇచ్చిన ఇంటర్ గవర్నమెంట్ ప్యానెల్ ఆన్ క్లైమెట్ ఛేంజెస్ (IPCC)రిపోర్టులో ఈ విషయం స్పష్టం చేశారు.

శాటిలైట్ అందించిన డేటా ఆధారంగా.. అధ్యయనం చేసిన శాస్త్ర వేత్తలు.. 1992 నుంచి 2001 మధ్య అంటార్కిటికా వద్ద ఏడాదికి 112 బిలియన్ టన్నుల మంచు పోగైందని పేర్కొన్నారు. కాగా.. తర్వాత ఐదేళ్లలో ఈ రేటు కాస్త తగ్గినా.. 2003 నుంచి 2008 వరకూ ఏడాదికి 82 బిలియన్ టన్నుల మంచు వచ్చి చేరిందని తెలిపారు.

తమ అధ్యయనాల్లో వెస్ట్ అంటార్కిటికాలోని పైన్ ద్వీపం ప్రాంతంలో మంచు ఉత్సర్గ పెరుగుదల(మంచు కరగటం)నమోదైందని వివరించారు. కానీ ఈస్ట్ అంటార్కిటికా.. వెస్ట్ అంటార్కిటికాలోని లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి  దీనికి భిన్నంగా ఉందని
ఆయన అన్నారు. ఈ ప్రాంతంలో తాము మంచు పెరగటాన్ని గమనించామని చెప్పారు. ఇది ఇతర ప్రాంతాల్లో మంచు నష్టాలను మించి ఉందని అన్నారు. కానీ.. అంటార్కిటికాలో మునుపటి మంచు గుట్టలను తిరిగి పొందేందుకు కొన్ని దశాబ్దాల సమయం పట్టవచ్చని అభిప్పాయపడ్డారు.  

మంచు యుగం ముగిసిన తర్వాత ఈ ఖండం మీద వాయువుల ఉష్ణోగ్రత, గాలిలో తేమ శాతం పెరిగాయని తెలిపారు. దీని కారణంగా.. దృవాల వద్ద 50శాతం మంచు కరిగి పోయిందని వివరించారు. సుమారు 10వేల సంవత్సరాల నుంచి దృవాల వద్ద మంచు పోగు పడటం.. గట్టిపడటం మొదలైందని తెలిపారు. మంచు గట్టిపడటానికి శతాబ్దాల సమయం పట్టిందని అన్నారు. తూర్పు అంటార్కిటికా, పశ్చిమ అంటార్కిటికా లోతట్టు ప్రాంతాల్లో ఏటా 0.7 అంగుళాల మేర మంచు గుట్టలు పెరుగుతున్నాయని చెప్పారు.

సముద్రమట్టాలు పెరిగేందుకు అంటార్కిటికా మంచు కారణం కాదని ఈపరిశోధనలు స్పష్టం చేస్తున్నాయని అన్నారు. అయితే.. ఏటా సముద్ర మట్టాలు 0.27 మిల్లీ మీటర్ల పెరుగుదల నమోదు చేస్తున్నాయి. వీటికి వేరే ఏదైనా కారణం ఉండి ఉంటుందని అన్నారు. ఈ కారణం ఏంటో తేల్చడం ప్రస్తుతం సైంటిస్టుల ముందున్న పెద్ద సవాలని ఆయన అన్నారు.
 

మరిన్ని వార్తలు