ఇరు దేశాలు సంయమనం పాటించాలి : ఐరాస

27 Feb, 2019 10:40 IST|Sakshi

న్యూయార్క్‌ : జైషే ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడుల నేపథ్యంలో పాకిస్తాన్‌- భారత్‌లు సంయమనం పాటించాలని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెరెస్‌ విఙ్ఞప్తి చేశారు.ఈ మేరకు ఆయన అధికార ప్రతినిధి స్టెఫానే డుజారిక్‌ మాట్లాడుతూ..‘ గత కొంతకాలంగా భారత్‌- పాకిస్తాన్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను, ప్రతీకార దాడులను ఆంటోనియో నిశితంగా పరిశీలిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇరు దేశాల ప్రభుత్వాలు పూర్తి సంయమనం పాటించాలని.. పరిస్థితులు దిగజారకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని ఆయన విఙ్ఞప్తి చేశారు’ అని వ్యాఖ్యానించారు.

అయితే భారత వైమానిక దళం జరిపిన దాడుల్లో సుమారు 300 మంది ఉగ్రవాదులు హతమైనట్లు వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన డుజారిక్‌.. ఇందుకు సంబంధించి తమ వద్ద ఎటువంటి సమాచారం లేదన్నారు. కాగా పుల్వామా ఉగ్రదాడికి దీటుగా బదులిస్తామన్న భారత్‌.. ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా మంగళవారం తెల్లవారుజామున మెరుపు దాడులు చేసిన సంగతి తెలిసిందే. 12 మిరాజ్‌-2000 జెట్‌ ఫైటర్స్‌తో చేపట్టిన సర్జికల్‌ స్ట్రైక్‌-2 విజయవంతంగా పూర్తి చేసి... అమర జవాన్లకు ఘన నివాళులు అర్పించింది.

మరిన్ని వార్తలు