కరోనా : యాపిల్‌ రీటైల్‌ స్టోర్లు బంద్‌

14 Mar, 2020 17:56 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

కోవిడ్‌-19 (కరోనా వైరస్‌) విలయంతో టెక్‌దిగ్గజం యాపిల్‌ కూడా కీలక నిర్ణయం తీసుకోక తప్పలేదు. మార్చి 27 వరకు తన ఆఫ్‌లైన్ రిటైల్ దుకాణాలన్నీ తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు  ఒక ప్రకటించింది.అయితే కరోనా వైరస్‌ మొదలైన చైనాలో పరిస్థితి కాస్త కుదుటు పడ్డంతో, అక్కడ  యాపిల్‌స్టోర్‌ను తిరిగి ప్రారంభించింది. అయితే ప్రపంచదేశాల్లో  ఈ మహమ్మారి విజృంభిస్తుండటం, ప్రపంచ ఆరోగ్య సంస్థ  కూడా కీలక ప్రకటన చేసిన నేపథ్యంలో ఈ వైరస్‌  వ్యాప్తిని అడ్డుకునే చర్యల్లో భాగంగా స్టోర్లను తాత్కాలిగా మూసివేస్తున్నామని ఒక ప్రకటనలో పేర్కొంది. యాపిల్‌ కార్యాలయాలు, ఉద్యో‍గుల్లో, కరోనా వ్యాప్తిని నివారించడానికి చేయగలిగినదంతా చేయాలి. ఈ నేపథ్యంలోనే మార్చి 27వరకు గ్రేటర్ చైనా వెలుపల అన్ని దుకాణాలను తాత్కాలికంగా మూసివేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా 15 మిలియన్ల డాలర్ల సహాయాన్ని అందిస్తున్నట్టు యాపిల్‌ సీఈవో ట్విటర్‌లో వెల్లడించారు. 

అయితే యాపిల్‌ అధికారిక వెబ్‌సైట్ (www.apple.com) యాప్ స్టోర్ ద్వారా ఆన్‌లైన్‌లో వినియోగదారులకు అందుబాటులోవుంది. ఏవైనా సందేహాలుంటే వినియోగదారులు ఆన్‌లైన్ ఆపిల్ కస్టమర్ కేర్‌ను సందర్శించవచ్చు. అంతేకాదు కోవిడ్‌-19కు సంబంధించిన  తాజా సమాచారాన్ని అందించేందుకు ఒకవిభాగాన్ని కూడా ప్రారంభించింది. కరోనావైరస్ మహమ్మారి కారణంగా, ఆపిల్ తన డెవలపర్ కాన్ఫరెన్స్ కు సంబంధించి  ఆన్‌లైన్ ఫార్మాట్‌ను ఆశ్రయిస్తోంది. ఈ ఏడాది జూన్‌లో జరగనున్న ఆపిల్ వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్-2020 ఆన్‌లైన్ కీనోట్,  సెషన్‌లు ఆన్‌లైన్‌లోనే వుంటాయని  గ్లోబల్‌ మార్కెటింగ్  సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ఫిల్ షిల్లర్  తెలిపారు. రానున్న వారాల్లో మరింత సమాచారాన్ని అందిస్తామని తెలిపారు. 

కాగా ప్రస్తుతానికి, కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా 1,45,000 మందికి పైగా సోకింది. 5400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. భారత దేశంలో ఈ కోరన్‌ కోరలకు చిక్కిన వారి సంఖ్య శనివారం  నాటికి 84కు చేరింది.  జాతీయ విపత్తుగా భారత ప్రభుత్వం ప్రకటించగా, దేశంలోని  దాదాపు అన్ని  రాష్ట్రాలు అన్ని విద్యాలయాలు, సినిమా థియేటర్లను, షాపింగ్‌మాల్స్‌ను మూసివేస్తున్నట్టు ప్రకటిచాయి. 

మరిన్ని వార్తలు