నిలబడితేనే ఆరోగ్యం..

17 Jun, 2018 02:38 IST|Sakshi

కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయనేది పాత సామెత.. పనిచేయకుండా ఖర్చు చేసేవారిని ఉద్దేశించి పుట్టిన సామెత అది. కానీ కూర్చుని పనిచేస్తే రోగాలన్నీ చుట్టుముడతాయన్నది తాజా సామెత. వైవిధ్యంతో కూడిన నూతన ఆవిష్కరణల కోసం తహతహలాడే యాపిల్‌ సంస్థ తమ ఉద్యోగులను నిలబడే పనిచేయమంటోంది. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న తమ 175 ఎకరాల క్యాంపస్‌లో పనిచేసే ఉద్యోగులందరికీ స్టాండింగ్‌ డెస్క్‌లు అందుబాటులోకి తెచ్చింది. ఆరోగ్యకరమైన జీవనశైలికి ఇది దోహదపడుతుందని సంస్థ సీఈవో టిమ్‌ కుక్‌ గట్టిగా నమ్ముతున్నారు. ఆఫీసుల్లో ఎక్కువ సమయం కూర్చుని పనిచేయడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని.. అసలు ఎక్కువసేపు కూర్చుని ఉండడమే ‘ఓ కేన్సర్‌’అని డాక్టర్లు భావిస్తున్నారని ఆయన అంటున్నారు. అందువల్లే స్టాండింగ్‌ డెస్క్‌లను ఏర్పాటు చేశామని తమ ఆంతర్యాన్ని వెల్లడించారు. ఈ పని విధానంలో భాగంగా ఉద్యోగులు తమకు నచ్చిన ఫర్నిచర్‌ను ఎంపిక చేసుకోవచ్చు. టేబుల్, కుర్చీలు, క్యూబికల్స్‌తో కూడుకున్న సగటు ఆఫీసు వాతావరణానికి భిన్నంగా వివిధ ఆకృతులు, డిజైన్లలో మార్చుకునేందుకు వీలుగా ఈ డెస్క్‌లను రూపొందించారు. 

18, 19 శతాబ్దాల్లోనే.. 
నిలబడి పనిచేసే ఆలోచన ఇప్పుడు కొత్తగా అనిపిస్తున్నా.. 18, 19వ శతాబ్దాల్లోనే ధనికవర్గం ఈ పద్ధతిని తమ ఇళ్లు, కార్యాలయాల్లో ఉపయోగించినట్టు చెబుతున్నారు. రోజంతా ఒకేచోట కూర్చుని పనిచేస్తే బద్ధకం ఆవరించడంతో పాటు పనిలో చురుకుదనం లోపిస్తోందని భావించేవారు. అదే నిలబడి పనిచేయడం వల్ల ఆరోగ్యపరమైన ప్రయోజనాలు ఉంటాయని చెప్పేవారు. అలా నిలబడి పనిచేసే విధానాన్ని అమలు చేసినవారిలో ప్రసిద్ధ చిత్రకారుడు లియోనార్డో డావిన్సీ, అమెరికా ప్రముఖులు బెంజమిన్‌ ఫ్రాంక్లిన్, థామస్‌ జఫర్‌సన్, ఆ దేశ సుప్రీంకోర్టు జడ్జి అలివర్‌ వెండెల్‌ హోమ్స్‌ జూనియర్, బ్రిటన్‌ ప్రధాని విన్‌స్టన్‌ చర్చిల్, ప్రముఖ రచయితలు వర్జీనియా ఉల్ఫ్, అల్బర్ట్‌ కామూ, ఎర్నెస్ట్‌ ఎమింగ్వే తదితరులు ఉండటం గమనార్హం. 

మంచి, చెడూ.. రెండూ ఉన్నాయి.. 
స్టాండింగ్‌ డెస్క్‌ల వినియోగం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని కొందరు చెబుతుండగా.. దానితో నష్టాలు కూడా ఉంటాయని మరికొందరు వాదిస్తున్నారు. ఏదేమైనా ఎక్కువ అధిక గంటల పాటు కూర్చుని పనిచేసినా.. నిలుచుని పనిచేసినా ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. 

- కూర్చుని పనిచేయడం కంటే నిలబడి పనిచేస్తే గుండె కొట్టుకునే వేగం పెరుగుతుందని అంటున్నారు. గణనీయంగా కాలరీలు ఖర్చవుతాయని.. స్థూలకాయం ముప్పు తగ్గుతుందని పేర్కొంటున్నారు. స్టాండింగ్‌ డెస్క్‌ వల్ల ఒక్కో నిమిషానికి 0.7 కేలరీలు ఖర్చు చేయొచ్చని.. ఏడాదికి 30 వేల కేలరీలు కరిగించవచ్చని డాక్టర్లు కూడా చెబుతున్నారు. ఎక్కువగా నిలబడి గడిపితే ఆయుష్షు కూడా పెరుగుతుందంటున్నారు. నిలబడి ఉండడం, అటూ ఇటూ కదలడం వల్ల గుండె జబ్బు ముప్పు తగ్గుతుందని పేర్కొంటున్నారు. స్టాండింగ్‌ డెస్క్‌ల వద్ద నిలబడి పనిచేస్తే నైపుణ్యాలు పెరుగుతాయని చెబుతున్నారు. 
ఇక ఆఫీసు ఉద్యోగులకు ‘నిలబడే పనిచేయడం’ మంచి ప్రత్యామ్నాయంగా ఆమోదించలేమంటోంది ఆస్ట్రేలియాకు చెందిన కుర్టిన్‌ వర్సిటీ. నిలబడి పనిచేయడం వల్ల ఆరోగ్యంపై ప్రభావం పడడంతో పాటు ఉత్పాదకత తగ్గుతుందని తమ అధ్యయనంలో తేలినట్టు వెల్లడించింది. స్టాండింగ్‌ డెస్క్‌ల వద్ద రెండు గంటలు పనిచేశాక అసౌకర్యానికి గురయ్యామని.. కండరాలు పట్టేసినట్టు, మోకాలి కింది భాగం వాచినట్టుగా ఉందని చాలా మంది ఫిర్యాదు చేసినట్టు పేర్కొంది. సృజనాత్మకత, మెరుగైన నైపుణ్యాలు అవసరమైన చోట్ల ఈ విధానం అనువుగా ఉండొచ్చని.. మిగతాచోట్ల సరిపోకపోవచ్చని స్పష్టం చేసింది. 

మరిన్ని వార్తలు