ఆపిల్‌కు షాక్‌ : డిజైన్‌ జీనియస్‌ గుడ్‌ బై

28 Jun, 2019 20:31 IST|Sakshi

ఆపిల్ చీఫ్ డిజైన్‌ ఆఫీసర్ జానీ ఐవ్‌ రాజీనామా

‘లవ్‌ ఫ్రమ్‌’ అనే కొత్త డిజైన్‌ కంపెనీ

ఐవ్‌  లేని ఆపిల్‌ ఉత్సత్తులను ఊహించలేం - టిమ్‌ కుక్‌

టెక్ దిగ్గజం ఆపిల్‌కు  ఊహించని పరిణామం ఎదురైంది. తన అద్భుతమైన డిజైన్లతో ఆపిల్‌ సంస్థకు తనదైన ముద్రను అందించిన  చీఫ్ డిజైన్ ఆఫీసర్ డిజైనర్ జోనాథన్ పాల్ ఐవ్‌ (జానీ ఐవ్‌) రాజీనామా చేయనున్నారు. 1992 నుంచి  27  సంవత్సరాలు సంస్థకు విశేష సేవలందించిన  జానీ ఐవ్‌  (52) ఈ ఏడాది చివరి నాటికి  కంపెనీని వీడనున్నారు. ముఖ్యంగా తన సొంత డిజైనింగ్ కంపెనీ  ప్రారంభించే యోచనలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచంలో 100మంది బాల్డ్‌మెన్‌లో ఒకరిగా పేరు గడించిన ఐవ్‌  ‘లవ్‌ ఫ్రమ్‌’ అనే కొత్త సంస్థను లాంచ్‌ చేయనున్నారు. 

ఆపిల్‌ పునరుజ్జీవనంలోనూ, ఉత్పత్తుల డిజైన్లలో కీలక పాత్ర పోషించిన ఏకైన వ్యక్తి ఐవ్‌ ఒక్కరే అంటే అతిశయోక్తి కాదు. 5వేలకు పైగా పేటెంట్లు, బెస్ట్‌ డిజైనర్‌గా పలు  ప్రతిష్టాత్మక అవార్డులు ఆయన సొంతం.  ఈవ్ లేకుండా ఆపిల్  పరికరాలను ఊహించుకోవడం అసాధ్య అని ఆపిల్‌ సీఈవో కుక్‌ వ్యాఖ్యలే ఐవ్‌ ప్రతిభకు నిదర్శనం. మరోవైపు యాపిల్ కంపెనీలో ఉద్యోగం నుంచి రాజీనామా చేసినప్పటికీ ఇదే కంపెనీతో కలిసి పలు ప్రాజెక్టులు చేపడతామని ఆపిల్‌ ప్రకటించింది చీఫ్‌ డిజైన్‌ ఆఫీసర్‌గా ఐమాక్, ఐఫోన్, ఆపిల్ పార్క్, ఆపిల్‌ రీటైల్‌స్టోర్లను తీర్చిద్దిద్దడంలో అతని పాత్ర అపూర్వమని  టిమ్ కుక్  ప్రశంసించారు. ఆపిల్ ఫౌండర్ స్టీవ్ జాబ్స్ ఓ సందర్భంలో తనకు యాపిల్‌లో ఎవరైనా స్పిరిచ్యువల్ పార్ట్‌నర్ ఉన్నారా అంటే అది జానీ ఐవ్ మాత్రమేనని వ్యాఖ్యానించారట. అంతేకాదు ఆపిల్‌ ఉత్పత్తుల  మార్కెటింగ్‌లో ఐవ్‌ వాయిస్‌ ఒక పెద్ద మ్యాజిక్‌ అని బిజినెస్‌వర్గాల టాక్‌. 

తన  నిష్క్రమణపై ఐవ్‌ మాట్లాడుతూ గతంకంటే  బలంగా, శక్తివంతంగా, మరింత  నైపుణ్యంతో తన సహోద్యోగులతో కూడిన ఆపిల్ డిజైన్‌ టీం ఉత్తమంగా ఉంటుందనే  నమ్మకాన్ని వ్యక్తం చేశారు.  రాబోయే చాలా సంవత్సరాల్లో వారితో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు. 
 

మరిన్ని వార్తలు