ట్రంప్ నిర్ణయంపై భగ్గుమన్న గూగుల్‌, యాపిల్‌

6 Sep, 2017 19:20 IST|Sakshi
ట్రంప్ నిర్ణయంపై భగ్గుమన్న గూగుల్‌, యాపిల్‌
హోస్టన్‌: వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తాజాగా డ్రీమర్స్‌ వర్క్‌పర్మిట్లను రద్దు చేయడం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తల్లితం‍డ్రులతో కలిసి బాల్యంలోనే అమెరికాకు వచ్చి అక్కడే ఉద్యోగాలు చేస్తున్న వారిని అక్రమ వలసదారులుగా ట్రంప్‌ యంత్రాంగం గుర్తించిన క్రమంలో తమ ఉద్యోగులకు బాసటగా నిలవాలని యాపిల్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్ సహా పలు అమెరికన్‌ టెక్నాలజీ కంపెనీలు నిర్ణయించాయి. గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ సైతం ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.
 
డీఏసీఏకు మద్దతుగా అమెరికా కాంగ్రెస​ చర్యలు చేపట్టాలని ఆయన ట్వీట్‌ చేశారు..ట్రంప్‌ యం‍త్రాంగం తీసుకున్ననిర్ణయాన్ని యాపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ తీవ్రంగా ఖండించారు. ఈ నిర్ణయంతో తమ ఉద్యోగుల్లో ఎవరికైనా ఇబ్బందులు ఎదురైతే వారికి ఇమిగ్రేషన్‌ నిపుణుల సూచనలతో పాటు అవసరమైన సాయం అందిస్తామని కుక్‌ స్పష్టం చేశారు.  తమ డ్రీమర్ల కోసం యాపిల్‌ పోరాడుతుందని కుక్‌ ట్వీట్‌ చేశారు. డ్రీమర్లు అమెరికాను, పౌర సమాజాన్ని పటిష్టం చేశారని, ప్రతి ఒక్కరికి ఆర్థిక అవకాశాల కోసం తాము కట్టుబడిఉంటామని మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల అన్నారు.
 
ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ కూడా ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. గత అధ్యక్షుడు ఒబామా కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా తీసుకువచ్చిన డీఏసీఏకు అనుకూలంగా కాంగ్రెస్‌ మద్దతు కూడగట్టాలని పిలుపు ఇచ్చారు.
>
మరిన్ని వార్తలు