యాపిల్‌ సీఈవో జీతమెంతో తెలుసా?

7 Jan, 2016 14:14 IST|Sakshi
యాపిల్‌ సీఈవో జీతమెంతో తెలుసా?

ఐఫోన్‌లు, ఐ ప్యాడ్‌లు విక్రయించే యాపిల్‌ సంస్థ గత ఏడాది భారీ లాభాలు ఆర్జించింది. 2015లో సంస్థ అమ్మకాలు 28శాతం పెరిగి.. లాభాలు 38శాతం పెరిగాయి. దీంతో యాపిల్‌ సీఈవో టిమ్‌ కూక్‌ వేతనం కూడా భారీగా పెరిగింది. 2015లో ఆయన వేతన 11.5శాతం పెరిగి 10.3 మిలియన్ డాలర్ల (రూ. 69 కోట్ల)కు చేరుకుంది. ఇదంతా బాగానే ఉన్నా 2008 తర్వాత తొలిసారి యాపిల్‌ వాటాలు మాత్రం గత ఏడాది పతనమయ్యాయి.

ఇక యాపిల్‌ కంపెనీలో సీఈవో కూక్‌ కన్నా ఇతర ఎగ్జిక్యూటివ్‌ల జీతాలు అధికంగా ఉండటం గమనార్హం. గత ఏడాది యాపిల్ చీఫ్ ఫైనాన్షియల్ అధికారి లుకా మేస్ట్రీ వేతనం 81శాతం పెరిగి 25.3 మిలియన్ డాలర్ల (రూ. 169  కోట్ల)కు పెరిగింది. అదేవిధంగా రిటైల్, ఆన్‌లైన్ స్టోర్స్‌ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌ ఏంజెలా ఎరెండట్స్‌ వేతనం భారీగా పెరిగి 25.8 మిలియన్ డాలర్ల (రూ. 172 కోట్ల)కు చేరుకుంది.

2015లో కూక్‌ మౌలిక వేతనం 14.4 శాతం పెరిగి రెండు మిలియన్‌ డాలర్లకు చేరుకోగా, ఆయనకు చెల్లించే నాన్ ఈక్విటీ పరిహారం 19శాతం పెరిగి 8 మిలియన్ డాలర్లకు చేరుకుంది. కూక్‌ నేతృత్వంలో 2015 యాపిల్‌కు బాగా కలిసొచ్చింది. చైనాలో యాపిల్‌ అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. ఐఫోన్ అమ్మకాలు రికార్డుస్థాయిలో కొనసాగాయి.

>
మరిన్ని వార్తలు