లక్ష ఏళ్ల తర్వాత.. తొలిసారి!

6 Jun, 2016 10:46 IST|Sakshi
లక్ష ఏళ్ల తర్వాత.. తొలిసారి!

ఎప్పుడూ మంచుతో కప్పబడి ఉండే ఆర్కిటిక్ సముద్రంపై ఈ ఏడాది మంచు కనుమరుగు కానుందా..? దాదాపు ఒక లక్ష సంవత్సరాల క్రితం జరిగిన ఈ ఘటన మళ్లీ పునరావృతం కానుందా? అంటే నిపుణులు ఔననే అంటున్నారు. యూఎస్ నేషనల్ ఐస్ అండ్ స్నో డేటా సెంటర్ జూన్ 1న నిర్వహించిన సర్వేలో వచ్చిన ఫలితాలు ఈ నిజాన్ని వెల్లడించాయి. గత 30 ఏళ్లుగా కోటీ ఇరవై ఏడు లక్షల చదరపు కిలోమీటర్లలో  విస్తీర్ణంలో ఉన్న మంచు ఈ ఏడాది కోటీ పదకొండు లక్షలకు పడిపోయిందని తెలిపారు. ఈ కరిగిపోయే మంచు భాగం 15 లక్షల చదరపు కిలోమీటర్లుకు పైగా ఉంటుందనీ.. ఇది ఆరు యునైటెడ్ కింగ్ డమ్(యూకే) ల విస్తీర్ణానికి సమానమని చెప్పారు.

తాను నాలుగేళ్ల క్రితం తెలిపిన ప్రతిపాదనల మేరకు 10 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మాత్రమే మంచు కరిగిపోతుందని పోలార్ ఓషన్ ఫిజిక్స్ గ్రూప్ హెడ్, కేంబ్రిడ్జి యూనివర్సిటీ ప్రొఫెసర్ పీటర్ వాధమ్స్ తెలిపారు. ఈ సంవత్సరం ఇంతమొత్తంలో కరిగిపోకపోయినా వచ్చే ఏడాది కచ్చితంగా కరుగుతుందని వివరించారు. ఆర్కిటిక్ మధ్య భాగం, ఉత్తరాన మంచు ఎక్కువగా కరిగే అవకాశం ఉందని చెప్పారు. దాదాపు లక్ష నుంచి లక్షా ఇరవై వేల ఏళ్లకు పూర్వం ఇలానే మంచు కరిగిందని తెలిపారు. పెను తుపానులు, యూకేలో వరదలు, అమెరికాలో టోర్నడోలు, ఉత్తర రష్యా తీరంలో మంచు కరిగిపోవడం తదితర పెనుమార్పులే ఆర్కిటిక్ లో ఉష్ణోగ్రతలను తీవ్రంగా పెంచనున్నట్లు వివరించారు. సముద్రం మీద గ్రీన్ హౌస్ వాయువుల  ప్రభావం గురించి పరిశీలించగా.. మిథేన్ ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు శాస్త్రజ్ఞలు తెలిపారు.

మరిన్ని వార్తలు