వైరలవుతోన్న పోలీసాఫీసర్‌ ఫోటో

21 Aug, 2018 18:49 IST|Sakshi
చిన్నారికి పాలు పడుతున్న పోలీస్‌ అధికారి సెలెస్ట్ జాక్వెలిన్ అయాలా

బ్యూనస్ ఎయిర్స్‌ : కంటేనే అమ్మా అవుతుందా.. కాదు, బిడ్డ ఆకలి గుర్తించి స్పందించే ప్రతి స్త్రీ కూడా మాతృమూర్తే. ఇందుకు నిదర్శనంగా నిలిచారు అర్జెంటీనాకు చెందిన ఓ మహిళా పోలీసు అధికారి. ఆకలితో గుక్కపట్టిన చిన్నారికి స్తన్యమిచ్చి అమ్మ ప్రేమకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో ఇప్పుడు ఇంటర్‌నెట్‌లో హల్‌చల్‌ చేస్తోంది. వివరాల ప్రకారం.. అర్జెంటీనాకు చెందిన సెలెస్ట్ జాక్వెలిన్ అయాలా ఒక పిల్లల ఆస్పత్రి వద్ద గార్డ్‌గా పనిచేస్తోంది.

ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం పోషాకాహార లోపంతో బాధపడుతోన్న ఒక పసివాణ్ణి ఆ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఒక రోజు జాక్వెలిన్‌ విధుల్లో ఉన్న సమయంలో ఆ బాలుడు గుక్కపట్టి ఏడ్వడం ప్రారంభించాడు. ఆ పసివాడి ఏడుపు జాక్వెలిన్‌ మాతృహృదయాన్ని కదిలించింది. దాంతో వెంటనే జాక్వెలిన్‌ ఆస్పత్రి సిబ్బందిని అడిగి ఆ పసివాడికి పాలిచ్చింది. జాక్వెలిన్‌ చూపిన మాతృప్రేమ అక్కడ ఉన్న వారి మనసులను కదిలించింది. వెంటనే ఆ అపురూప దృశ్యాన్ని తమ కెమెరాల్లో బంధించారు.

ఇంటర్‌నెట్‌లో షేర్‌ చేసిన ఈ ఫోటో జాక్వెలిన్‌ని ఓవర్‌ నైట్‌ స్టార్‌గా మార్చేసింది. ఈ ఫోటోను ఇప్పటికే ఒక లక్ష మంది షేర్‌ చేయగా, ఫేస్‌బుక్‌లో ప్రశంసలు వెల్లువ కొనసాగుతోంది. ట్విటర్‌లో అయితే జాక్వెలిన్‌ పేరే ఒక హాష్‌ట్యాగ్‌గా మారిపోయింది. జాక్వెలిన్‌ గురించి తెలుసుకున్న అర్జెంటీనా వైస్‌ ప్రెసిడెంట్‌ క్రిస్టియాన్‌ రిటోండో.. ఆమెను ప్రత్యేకంగా అభినందించడమే కాక, పోలీస్‌ అధికారి స్థాయి నుంచి సార్జంట్‌గా పదోన్నతి కల్పించారు.

మరిన్ని వార్తలు