మోదీకి గట్టి షాకిచ్చిన కెనడియన్లు

8 Jun, 2018 13:09 IST|Sakshi

ఒట్టావా : ప్రపంచ వ్యాప్తంగా భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విదేశీ పర్యటనకు వెళ్లిన సందర్భాల్లో అక్కడ ఆయన క్రేజ్‌ గురించి తరచూ వార్తల్లో చూస్తుంటాం. అయితే కెనడియన్లు మాత్రం ఈ విషయంలో మోదీకి గట్టి షాకే ఇచ్చారు. అసలు మోదీ ఎవరో తమకు తెలీదంటూ ఓ సర్వేలో వారు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంగుస్‌ రెయిడ్‌ ఇన్‌స్టిట్యూట్‌(ఏఆర్‌ఐ) అనే సంస్థ కెనడియన్లపై ఓ సర్వే నిర్వహించింది. ఇందులో 75 శాతం మంది కెనడియన్లు అసలు నరేంద్ర మోదీ అంటే ఎవరో తమకు తెలియదని చెప్పారు. జీ7 దేశాల సమావేశం నేపథ్యంలో జీ7, బ్రిక్స్‌(బ్రెజిల్‌, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా) దేశాధినేతల గురించి ప్రజల్లో ఏ మాత్రం అవగాహన ఉందని తెలుసుకోవటానికి ఈ సర్వే నిర్వహించారు. 

‘మోదీ ఎవరు?’ ఈ విషయమై ఏఆర్‌ఐ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ షాచి కర్ల్‌ మాట్లాడుతూ.. ‘మా దగ్గర సరైన గణాంకాలు లేవు గానీ.. మోదీ ఎప్పుడూ ఇంగ్లీష్‌లో మాట్లాడలేదు. అందుకే పశ్చిమ దేశాల మీడియాను, ప్రజలను ఆయన అంతగా ఆకట్టుకోలేకపోయారనుకుంటా. ఇండియాతో ఉన్న వాణిజ్య సంబంధాల గురించి కెనడా ప్రజలకు అవగాహన ఉంది. కానీ మోదీకి ఇక్కడి ప్రజల్లో పాపులారిటీ లేదన్నది ఈ సర్వేతో స్పష్టమైంది. కెనడాలో ఆయనేమంత బిగ్‌ సెలబ్రిటీ కాదు’ అంటూ  వ్యాఖ్యానించారు. అయితే ప్రభావంతమైన, వ్యూహాత్మకమైన, బలమైన నాయకత్వం కలిగిన వ్యక్తులుగా గుర్తింపు పొందిన దేశాధినేతలు అనే మూడు అంశాల్లో మాత్రం కొంతమంది నరేంద్ర మోదీ తమకు తెలుసని కొందరు చెప్పారంటూ షాచి పేర్కొన్నారు.

‘ట్రంప్‌ ఓ దురహంకారి’ 24 పదాలతో ఓ జాబితాను తయారు చేసిన నిర్వాహకులు.. ఆయా దేశాల అధినేతలకు ఏ పదం సరిపోతుందో తెలపాలంటూ సూచించారు. అయితే ఈ సర్వేలో అత్యధికంగా 74 శాతం మంది కెనడియన్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను అత్యంత దురహంకారిగా పేర్కొన్నారు. ‘అబద్దాలకోరు, నిజాయితీలేని వ్యక్తి, అవినీతిపరుడు’ అనే పదాలు ట్రంప్‌కు చక్కగా సరిపోతాయంటూ వారు అభిప్రాయపడ్డారు.

ఈ జాబితాలో తమ దేశ ప్రధాని జస్టిన్‌ ట్రూడోపై కెనడియన్లు మిశ్రమ అభిప్రాయాలను వ్యక్తం చేయటం కొసమెరుపు. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయల్‌ మాక్రాన్‌కు సర్వేలో టాప్‌ ర్యాంకు లభించగా.. జర్మనీ చాన్స్‌లర్‌ ఏంజెలా మెర్కెల్‌ అత్యంత శక్తివంతమైన నేతగా, అత్యంత ప్రభావంతమైన వ్యక్తిగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు కెనడియన్లు ఓటు వేశారు.

మరిన్ని వార్తలు