మళ్లీ వణికిన అమెరికా!

3 Nov, 2017 01:20 IST|Sakshi

కొలరాడో వాల్‌మార్ట్‌ స్టోర్‌లో కాల్పులు

సాయుధుడి ఘాతుకం.. ముగ్గురు మృతి  

వాషింగ్టన్‌: న్యూయార్క్‌ ఘటనను మరువక ముందే.. కొలరాడో రాష్ట్రంలో జరిగిన దుశ్చర్య అమెరికాను మరోసారి వణికించింది. కొలరాడో రాష్ట్రంలోని డెన్వర్‌ నగర శివార్లలోని వాల్‌మార్ట్‌లోకి బుధవారం రాత్రి 7.30 గంటల (స్థానిక కాలమానం ప్రకారం) ప్రాంతంలో ఓ ఆగంతకుడు చొరబడ్డాడు. లోపలకు ప్రవేశిస్తూనే హ్యాండ్‌గన్‌తో విచ్చక్షణారహితంగా కాల్పులు ప్రారంభించాడు. దీంతో కౌంటర్‌ సమీపంలో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు.

ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందగా.. సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ మహిళ మృతిచెందారు. కాల్పులు జరిపిన అనంతరం సాయుధుడు కారులో పారిపోయాడని అమెరికా మీడియా పేర్కొంది. ఒకవైపు కాల్పులు జరుగుతుండగానే.. పోలీసులు వాల్‌మార్ట్‌లోకి ప్రవేశించి లోపలున్న వారిని ప్రాణాలతో బయటకు తెచ్చారు. అయితే.. ఆ  ‘మొదటిసారి కాల్పుల శబ్దం వినబడగానే సూపర్‌ మార్కెట్‌లోని వారంతా గేట్‌ల వద్దకు పరుగులు తీశారు. ఉద్యోగులు, వినియోగదారులు అరుస్తున్నారు. ప్రాణాలు కాపాడుకునేందుకు దాక్కున్నారు’ అని అరోన్‌ స్టీఫెన్స్‌ అనే ప్రత్యక్ష సాక్షి తెలిపారు.

నిందితుడి గుర్తింపు
సీసీటీవీ ఫుటేజీలను విశ్లేషించిన పోలీసులు కాల్పులకు పాల్పడిన వ్యక్తిని స్కాట్‌ ఓస్ట్రీమ్‌ (47)గా గుర్తించారు. ఘటన జరిగిన 14 గంటల తర్వాత డెన్వర్‌ పట్టణానికి 8 కిలోమీటర్ల దూరంలో అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని వార్తలు