జపాన్‌లో దారుణం; కావాలనే నిప్పంటించాడా?

18 Jul, 2019 18:36 IST|Sakshi

టోక్యో: జపాన్‌లోని క్యోటో నగరంలో దారుణం జరిగింది. గుర్తు తెలియని దుండగుడు యానిమేషన్‌ కంపెనీకి నిప్పు పెట్టడంతో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 24 మంది సజీవ దహనం కాగా 35 మంది గాయాలపాలయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగే సమయంలో ఆ భవనంలో 70 మంది ఉన్నట్టు స్థానిక మీడియా చెబుతోంది.

కాగా ఉదయం పదిన్నర ప్రాంతంలో అగ్నిమాపక శాఖకు సమాచారం అందగా హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మూడంతస్థుల భవనంలో మంటలను అదుపులోకి తీసుకురావటానికి సహాయక చర్యలు చేపడుతున్నారు.  ఈ ప్రమాదంతో స్థానికులు భయభ్రాంతులకు లోనయ్యారు. వారు మాట్లాడుతూ ఘటనా స్థలంలో రెండు సార్లు పేలుళ్ల శబ్ధం వినపడిందన్నారు. భవనం నుంచి ఎరుపు రంగులో మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయన్నారు. ఇక జపాన్‌లో హింసాత్మక ఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. ఒకవేళ ఉద్దేశపూర్వకంగా పేలుడు ప్రమాదానికి పాల్పడితే జపాన్‌లో మరణ శిక్ష విధిస్తారు. గతంలో జపాన్‌లోని ఒసాకాలో నిప్పంటించి 16మంది మృతికి కారణమైన ఓ వ్యక్తికి 2008లో అక్కడి కోర్టు మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే.

>
మరిన్ని వార్తలు