‘కృత్రిమ గుండె’ సక్సెస్

22 Dec, 2013 16:59 IST|Sakshi
‘కృత్రిమ గుండె’ సక్సెస్

ప్రపంచంలోనే తొలిసారి...
పారిస్ వైద్య నిపుణుల ఘనత

గుండె జబ్బుతో బాధపడుతున్న ఒక వ్యక్తికి పారిస్ వైద్యులు విజయవంతంగా కృత్రిమ గుండెను అమర్చారు. ఇలాంటి శస్త్రచికిత్స జరగడం ప్రపంచంలో ఇదే తొలిసారి. పారిస్‌లోని జార్జెస్ పాంపిడోవు ఆస్పత్రిలో బుధవారం ఈ చరిత్రాత్మకమైన శస్త్రచికిత్స జరిగింది. రోగి స్పృహలోకి వచ్చి, చికిత్సకు భేషుగ్గా స్పందిస్తున్నట్లు వైద్య నిపుణులు ప్రకటించారు. ఫ్రాన్స్ ఆరోగ్య, సామాజిక వ్యవహారాల మంత్రి మారిసోల్ టౌరేనె, కృత్రిమ గుండెను తయారుచేసిన బయో మెడికల్ సంస్థ ‘కార్మాట్’ సహ వ్యవస్థాపకుడైన శస్త్రచికిత్స నిపుణుడు అలైన్ కార్పెంటీర్, ‘కార్మాట్’ అధినేత మార్సెలో కాన్విటీ శనివారం జార్జెస్ పాంపిడోవు ఆస్పత్రిలో ఏర్పాటైన మీడియా సమావేశంలో ఈ శస్త్రచికిత్స వివరాలను వెల్లడించారు.

తొలి కృత్రిమ గుండె అమర్చే శస్త్రచికిత్స విజయవంతం కావడంపై కాన్విటీ హర్షం వ్యక్తం చేశారు. సాధారణ గుండె కంటే కృత్రిమ గుండె మూడురెట్లు ఎక్కువ బరువు ఉంటుందని, ఐదేళ్ల వరకు ఇది ఎలాంటి ఢోకా లేకుండా పనిచేస్తుందని ఆయన తెలిపారు. గుండె మార్పిడి శస్త్రచికిత్సల్లో కృత్రిమ పరికరాలను తాత్కాలికంగా ఉపయోగిస్తుంటారని, అయితే, తాము కొత్తగా రూపొం దించిన కృత్రిమ గుండెను అసలు గుండె స్థానంలో పూర్తిస్థాయిలో అమర్చవచ్చని వివరించారు. దాతలు అందుబాటులో లేకపోవడం వల్ల ఏటా వేలాది మంది మరణిస్తున్నారని, అలాంటి వారి ప్రాణాలను నిలపడంలో ఈ కృత్రిమ గుండె ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ కృత్రిమ గుండెకు ఎయిర్‌బస్ పేరెంట్ కంపెనీ ‘ఈఏడీఎస్’ ఇంజనీర్ల బృందం రూపకల్పన చేసింది. దీని ధర దాదాపు 1.50 లక్షల పౌండ్లు (రూ.1.50 కోట్లు) వరకు ఉంటుంది. వెలుపల ధరించే లీథియం అయాన్ బ్యాటరీల ద్వారా ఈ కృత్రిమ గుండె పనిచేస్తుంది. రక్త ప్రసరణకు ఉపయోగపడే దీని లోపలి భాగాలను కృత్రిమ పదార్థాలతో కాకుండా, జంతు కణజాలంతో రూపొందించారు.
 

మరిన్ని వార్తలు