12 మంది దోషులుగా నిర్ధారణ

12 Sep, 2015 03:36 IST|Sakshi
12 మంది దోషులుగా నిర్ధారణ

- ముంబై రైలు పేలుళ్ల కేసులో మహారాష్ట్ర మోకా కోర్టు తీర్పు
- శిక్షల ఖరారుపై సోమవారం నుంచి వాదనలు.. ఐదుగురికి మరణశిక్ష పడే అవకాశం

ముంబై:
ముంబైలోని రైళ్లలో వరుస పేలుళ్లకు పాల్పడి 188 మందిని బలితీసుకున్న కేసులో 12 మందిని మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల నియంత్రణ (మోకా) కోర్టు శుక్రవారం దోషులుగా నిర్ధారించింది. సిమీ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్లు భావిస్తున్న వీరిలో ఐదుగురికి మరణశిక్ష పడే అవకాశం ఉంది.
 
2006 జూలై 11న సిమీ, లష్కరే తోయిబాతో సంబంధాలున్న ఉగ్రవాదులు ముంబైలోని సబర్బన్ రైళ్లలో వరుసగా ఏడు పేలుళ్లకు పాల్పడ్డారు. పది నిమిషాల వ్యవధిలో ఖర్‌రోడ్, బాంద్రా, శాంతాక్రజ్, జోగేశ్వరి, మాహిమ్ జంక్షన్, మిరారోడ్, మతుంగ, బొరివలి ప్రాంతాల మధ్య ప్రయాణిస్తున్న రైళ్లలో  పేలుళ్లు జరిగాయి. 188 మరణించగా... 829 మంది గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి మోకా చట్టంతో పాటు ఐపీసీ, పేలుడు పదార్థాల చట్టం, రైల్వే యాక్ట్ తదితర చట్టాల కింద 30 మందిపై మహారాష్ట్ర యాంటీ టైజం స్క్వాడ్ కేసులు నమోదు చేసింది. 13 మందిని అరెస్టు చేయగా.. పాకిస్తాన్‌కు చెందిన మిగతా 17 మంది పరారీలో ఉన్నారని పేర్కొంటూ మోకా కోర్టులో చార్జిషీటు దాఖలు చేసింది.

తొమ్మిదేళ్ల పాటు విచారణ జరగగా శుక్రవారం మోకా కోర్టు న్యాయమూర్తి యతిన్ డి షిండే 12 మందిని దోషులుగా నిర్ధారిస్తూ తీర్పు ఇచ్చారు. కమల్ అహ్మద్ అన్సారీ(37), తన్వీర్ అహ్మద్ అన్సారీ (37), మహ్మద్ ఫైసల్ షేక్(36), ఇస్తెహాం సిద్ధిఖీ(30), మహమ్మద్ మాజిద్ షఫీ(32), షేక్ ఆలం షేక్ (41), మహ్మద్ సాజిద్ అన్సారీ (34), ముజమిల్ షేక్(27), సోహైల్ మెహమూద్ షేక్(43), జమీర్ అహ్మద్ షేక్(36), నవీద్ హుస్సేన్ ఖాన్(30), ఆసిఫ్ ఖాన్(38)లను దోషులుగా నిర్ధారించగా.. మరొకరిని నిర్దోషిగా వదిలిపెట్టారు. అయితే వీరిలో ఐదుగురిని ఐపీసీ 302(హత్య), మోకాలోని సెక్షన్ 3(1) కింద దోషులుగా పేర్కొన్నారు. ఈ సెక్షన్ల ప్రకారం వారికి మరణశిక్ష పడే అవకాశం ఉంది. శిక్షల ఖరారుపై సోమవారం నుంచి వాదనలు జరిగే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు