ఫిలిప్పీన్స్‌లో ట్రంప్‌తో భేటీ అయిన మోదీ

13 Nov, 2017 11:25 IST|Sakshi

మనీలా: ఫిలిప్పీన్స్‌ రాజధాని మనీలాలో జరుగుతున్న 31వ ఆసియన్‌ (ఈశాన్య  ఆసియా దేశాల అసోసియేషన్‌) సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో భేటీ అయ్యారు. మధ్యాహ్నం ఒంటిగంటకు వీరి భేటీ జరగనున్నట్లు చెప్పుకున్నప‍్పటికీ కాస్త ఆలస్యమయ్యింది. వీరి భేటీలో ప్రధానంగా ఇరుదేశాల దౌత్య సంబంధాలు, రక్షణ, ఉగ్రవాదం అంశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా మోదీపై ట్రంప్‌ ప్రశంసలు కురిపించారు. ‘‘మోదీ మాకు మంచి మిత్రుడు. ఆయన పాలన భేషుగ్గా ఉంది. సమస్యలు చాలా వరకు పరిష్కారం అయ్యాయి. మున్ముందు కూడా భారత్‌తో మా మైత్రి ఇలాగే కొనసాగుతుంది’’ అని ట్రంప్‌ తెలిపారు. ఇక అమెరికాతో సంబంధాలు ఆర్థికపరమైనవే కావని.. అంతకు మించే ఉన్నాయని భారత ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అమెరికా-భారత్‌ మైత్రి ఆసియా అభివృద్ధికి కూడా ఎంతో దోహదపడుతుందని మోదీ చెప్పారు. 

మనీలా జరుగుతున్న ఆసియన్‌ సదస్సు ప్రారంభోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో ప్రధాని మోదీతోపాటు పలువురు దేశాధినేతలు పాల్గొన్నారు. అంతకుముందు లాస్‌ బోనోస్‌లోని రైస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ను ప్రధాని మోదీ సందర్శించి.. అక్కడి విశేషాలు అడిగి తెలుసుకున్నారు. మహావీర్‌ ఫిలీప్పీన్స్‌ ఫౌండేషన్‌ను కూడా ఆయన సందర్శించనున్నారు.

చైనాకు చెక్‌ పెట్టడమే లక్ష్యం!
వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో చైనా దూకుడుకు చెక్‌ పెట్టేలా భద్రతా సహకారంపై చర్చించేందుకు భారత్, అమెరికా, జపాన్, ఆ స్ట్రేలియా అధికారులు తొలిసారి మనీలాలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇండో–పసిఫిక్‌ను స్వేచ్ఛాయుత ప్రాంతంగా మార్చే అంశంపై ఈ నాలుగు దేశాలు చర్చించాయి. పరస్పర ప్రయోజనమున్న అంశాలపై కూడా చర్చలు కొనసాగాయి. అనంతరం భారత్, ఆస్ట్రేలియా, జపాన్‌లు వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేస్తూ‘ ఇండో–పసిఫిక్‌పై మరిన్ని చర్చలు కొనసాగించాలని, అంతర్జాతీయ చట్టాలు, నిబంధనలు అమలయ్యేలా సహకారాన్ని విస్తృతం చేసుకోవాలని సమావేశంలో నిర్ణయించాం’ అని పేర్కొన్నాయి. కలిసికట్టుగా పనిచేసేలా, ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, సామరస్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంగా చర్చలు సాగాయని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఉమ్మడి సవాలుగా మారిన ఉగ్రవాదం, ఉగ్రవ్యాప్తిపై కూడా సమావేశంలో చర్చించారని తెలిపింది.

>
మరిన్ని వార్తలు