ఆ గ్రహశకలం భూమిని ఢీకొట్టనుందా?

18 Jul, 2020 09:15 IST|Sakshi

మరో కొన్ని రోజుల్లో నిజంగానే భూమి అంతం కాబోతుందా? గ్రహశకలం భూమిని ఢీకొట్టడంతో అపార నష్టం జరగబోతుందా? సోషల్‌మీడియాలో ఇప్పటికే ఈ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అసలు విషయం ఏంటంటే... భారత కాలమానం ప్రకారం... సెప్టెంబర్ ఒకటో తేదీ ఉదయం 10.49 గంటలకు 2011 ES4 అనే గ్రహశకలం భూమివైపుగా వెళ్తుందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ  నాసా  తెలిపింది. అప్పుడు భూమికి గ్రహశకలానికి మధ్య దూరం 44618 మైళ్లు ఉంటుంది. ఇప్పటివరకూ చాలా గ్రహశకలాలు భూమివైపు నుంచి వెళ్లిన వాటివల్ల జీవ​కోటికి ఎలాంటి నష్టమూ జరగలేదు. అయితే ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేనట్లు కనిపిస్తున్నాయి. ఇప్పుడు రాబోతున్న గ్రహశకలం మాత్రం ఆందోళన కలిగిస్తోంది. ఎందుకంటే మిగతా గ్రహశకలాలు, చంద్రుని కంటే దూరంగా వెళ్లాయి. భూమికీ, చందమామకీ మధ్య దూరం 238855 మైళ్లు. ఈ గ్రహశకలం మాత్రం చందద్రుని  కంటే దగ్గర నుంచి భూమి మీదగా వెళ్లబోతోంది. 

భూమికి దగ్గరగా వచ్చే గ్రహశకలాల్ని నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్స్‌గా నాసా పరిగణిస్తుంది.  ఇవి తమ మార్గంలోవెళ్తూ వెళ్తూ, మధ్యలో ఏదైనా గ్రహం వస్తే... దాని గురుత్వాకర్షణ శక్తికి లోనవుతాయి. దిశ మార్చుకొని, ఆ గ్రహంవైపు వెళ్తాయి. ఇక  భూమి, చంద్రుల మధ్య నిరంతరం ఆకర్షణ శక్తి ఉంటుంది. దీని బట్టి చూస్తే మన భూమి ఆకర్షణ బలం అక్కడి వరకూ ఉంటుంది. ఈ గ్రహశకలం చందమామ కంటే దగ్గర భూమి వైపు నుంచి వెళ్తుంది కావున దీన్ని భూమి ఆకర్షించే అవకాశం ఎక్కువగా  ఉంది.  ఇది అంగారక, గురుగ్రహం మధ్య ఉండే గ్రహశకలాల్లో ఒకటి అయ్యిండవచ్చని  నాసా భావిస్తోంది. అయితే ఈ గ్రహశకలం కనుక భూమిని ఢీకొడితే పెద్ద అనర్థమే జరుగుతుంది. దీనిపై పరిశోధనలు చేసిన నాసా కొన్ని విషయాలను తెలిపింది. 

చదవండి: మాస్క్‌తో భూమికి సమీపంలో 1998 గ్రహశకలం..!

ఇలాంటి గ్రహశకలాలు భూమి, సూర్యుడి మధ్య భారీ కక్ష్యలో తిరుగుతుంటాయని నాసా తెలిపింది. సూర్యుడి చుట్టూ ఒకసారి తిరగడం పూర్తైన ప్రతిసారీ ఈ గ్రహశకలాలు భూ కక్ష్యలోకి వచ్చి వెళ్తుంటాయని పేర్కొంది. ఇదిలా ఉండగా  ఇంతకీ ఈ గ్రహశకలం భూమిని ఢీ కొడుతుందా అనే ప్రశ్నకు నాసా సమాధానమిస్తూ అలా జరగదని చెప్పింది. ఎందుకంటే, ఈ గ్రహశకలం భారీ సైజులో లేదనీ అందువల్ల దీన్ని ఆకర్షించేలోపే, ఇది భూ కక్ష్యను దాటి వేగంగా వెళ్లిపోతుందని నాసా వివరించింది. దీంతో ఇప్పటికే కరోనా  కారణంగా భారీ ప్రాణ నష్టం వాటిల్లగా, ఇప్పుడు గ్రహశకలం రూపంలో మరో పెనుప్రమాదం పోల్చి ఉంది అని భయపడినవారందరూ ఊపిరి పీల్చుకున్నారు.

చదవండి: యుగాంతం కథ ఏంటి?

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా