భూమివైపు దూసుకొస్తున్న గ్రహశకలం

20 Apr, 2017 14:01 IST|Sakshi
భూమివైపు దూసుకొస్తున్న గ్రహశకలం

దాదాపు 400 మీటర్ల వెడల్పున్న గ్రహశకలం ఒకటి భూమికి అతి దగ్గరగా దూసుకొస్తోంది. అది భూమికి కేవలం 18 లక్షల కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఈ విషయాన్ని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే దీనివల్ల భూమికి ఎలాంటి ప్రమాదం ఉండబోదని చెప్పారు. సాధారణంగా చిన్న గ్రహశకలాలు మామూలుగానే భూమికి దగ్గరగా వస్తాయి. 2014 జె025 అనే ఈ గ్రహశకలాన్ని 2014 మేలో గుర్తించారు. ఇది మాత్రం 2004 నుంచి ఇప్పటి వరకు భూమికి దగ్గరగా వచ్చిన వాటిలో అతి పెద్దదని అంటున్నారు. ఇది భూమికి, చంద్రుడికి మధ్య ఉన్న దూరానికి 4.6 రెట్ల దూరంలో ప్రయాణిస్తోంది.

భూమికి సమీపంగా కేవలం కొన్ని సెకండ్ల పాటే ఉంటుందని, అది కూడా కొన్ని వందల కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుందని నాసా నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్ ప్రోగ్రామ్‌కు చెందిన డేవీ ఫార్నోషియా చెప్పారు. కొన్ని సంవత్సరాలుగా గ్రహశకలాలు ప్రయాణించే తీరును పరిశీలిస్తుండటంతో.. దాని మార్గాన్ని కచ్చితంగా అంచనా వేయగలమని ఆయన అన్నారు. దీన్ని మామూలు కంటితో చూసే అవకాశం మాత్రం ఉండదు. ఇంట్లో ఉన్న టెలిస్కోపులతో ఈరోజు, రేపు రెండు రాత్రుల పాటు చూసే అవకాశం స్కై వాచర్లకు ఉంటుంది. రాబోయే 500 సంవత్సరాల్లో ఇంత దగ్గరగా వచ్చే గ్రహశకలం ఇంకోటి ఉండకపోవచ్చని అంటున్నారు. ఇంతకుముందు 2004 సంవత్సరంలో టౌటాటిస్ అనే గ్రహశకలం భూమికి 16 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి వెళ్లింది.

మరిన్ని వార్తలు