అక్కడ పగటిపూట ఐరన్‌ వర్షం..!

12 Mar, 2020 18:10 IST|Sakshi

లండన్‌ : సౌర కుటుంబానికి వెలుపల.. 650 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఓ గ్రహానికి సంబంధించి ఖగోళ శాస్త్రవేత్తలు ఆసక్తికర విషయాలను కనుగొన్నారు. అసాధారణ రీతిలో వేడిగా ఉండే ఆ గ్రహంపై ఐరన్‌ వర్షం కురుస్తోందని గుర్తించారు. స్విట్జర్లాండ్‌లోని జెనీవా యూనివర్సిటీతో కలిసి నిర్వహించిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైందన్నారు. ‘డబ్ల్యూఏఎస్‌పీ-76బీ’గా గర్తించిన ఆ గ్రహంపై పగటిపూట ఉష్ణోగ్రత్తలు దాదాపు 2400 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటాయని తెలిపారు. అధిక ఉష్ణోగ్రతల ప్రభావంతో లోహాలు ఆవిరిగా మారిపోతున్నాయని అభిప్రాయపడ్డారు. అక్కడ వీచే బలమైన గాలులు రాత్రి వేళను చల్లగా మారేలా చేస్తాయని, ఆ సమయంలో ఇనుము బిందువులుగా ఘనీభవిస్తుందని అంచనా వేశారు.

ఆ గ్రహం మాతృ నక్షత్రం చుట్టూ ఎదురుగా తిరుగుతున్న సమయంలో(పగటిపూట) మాత్రమే ఇనుము వర్షం కురుస్తుందని పేర్కొన్నారు. వాతావరణం చల్లబడ్డాక రాత్రిపూట పూర్తి చీకటి నెలకొంటుందని తెలిపారు. భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి 365 రోజులు 5 గంటల సమయం తీసుకుంటుందని.. కానీ ఆ గ్రహం మాత్రం తన మాతృ నక్షత్రానికి దగ్గరగా ఉండటంతో పరిభ్రమణానికి కేవలం 48 గంటలు పడుతుందన్నారు.  ఆ గ్రహం తన మాతృ నక్షత్రం నుంచి పగటిపూట భూమి సూర్యుని నుంచి గ్రహించే రేడియేషన్‌ కంటే వేల రేట్లు అధికంగా పొందుతుని ఆ పరిశోధనలో వెల్లడించారు. 

మరిన్ని వార్తలు