అట్లాంటా పోలీసు చీఫ్‌ రాజీనామా

15 Jun, 2020 05:22 IST|Sakshi
అట్లాంటాలో వెండీస్‌ రెస్టారెంట్‌ ఎదుట ఆందోళనకారులను అడ్డుకుంటున్న పోలీసులు

అట్లాంటా: ఆఫ్రో అమెరికన్‌ జార్జ్‌ ఫ్లాయిడ్‌ హత్యపై ఆందోళనలు పూర్తిగా చల్లారకముందే.. మరొక నల్ల జాతి వ్యక్తి అట్లాంటాలో పోలీసుల చేతిలో మరణించిన ఘటన ఉద్రిక్తతలకు దారి తీసింది. ఒక రెస్టారెంట్‌ ముందు వినియోగదారులకు ఇబ్బంది కలిగిస్తున్నాడన్న ఫిర్యాదుపై అరెస్ట్‌ చేసే క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో శుక్రవారం రాత్రి రేషర్డ్‌ బ్రూక్స్‌ అనే నల్లజాతి యువకుడు గాయపడ్డారు. అనంతరం చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ సమాచారం వెల్లడైన వెంటనే స్థానికంగా ఆందోళనలు చెలరేగాయి. ఘటన జరిగిన ప్రాంతంలోని వెండీ రెస్టారెంట్‌ను ధ్వంసం చేశారు.

అక్కడి హైవేను దిగ్బంధించారు. ఈ నేపథ్యంలో, ఈ కాల్పులకు బాధ్యత వహిస్తూ అట్లాంటా పోలీస్‌ చీఫ్‌ ఎరిక్‌ షీల్డ్‌ శనివారం రాజీనామా చేశారు. తాజాగా, ఆదివారం గారెట్‌ రాల్ఫ్‌ అనే పోలీసు అధికారిని విధుల నుంచి తొలగిం చారు. డేవిడ్‌ బ్రాస్నన్‌ అనే మరో అధికారిని పరిపాలన విధులకు బదిలీ చేశారు. ఘటన జరిగిన సమయంలో ఆ ఇద్దరు అధికారుల శరీరాలపై ఉన్న కెమెరా ఫుటేజ్‌ను కూడా అధికారులు విడుదల చేశారు. ఆందోళనల్లో పాల్గొన్న వారిలో 36 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. కాల్పుల ఘటనపై  దర్యాప్తు జరుపుతున్నారు. వెండీ రెస్టారెంట్‌ డ్రైవ్‌ ఇన్‌ మార్గానికి అడ్డుగా కారు పెట్టి నిద్ర పోతున్నాడని ఫిర్యాదు రావడంతో పోలీసులు అక్కడికి వెళ్లారని, కారులో మద్యం మత్తులో ఉన్న బ్రూక్స్‌ను అదుపులోకి తీసుకునే క్రమంలో కాల్పులు జరిగాయని అధికారులు అంటున్నారు.
 

మరిన్ని వార్తలు