నీగ్రోలను చంపడం, హింసించడం కొత్తకాదు

3 Jun, 2020 13:18 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఆఫ్రికా మూలాలు కలిగిన అమెరికన్‌ నల్ల జాతీయుడు జార్జ్‌ ఫ్లాయిడ్‌ను శ్వేత జాతీయుడైన పోలీసు అధికారి అన్యాయంగా చంపేయడంతో దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగుతున్న విషయం తెల్సిందే. అమెరికాలో నల్ల జాతీయులను శ్వేత జాతీయులైన పోలీసు అధికారులు చంపేయడం, హింసించడం ఇప్పుడే కొత్త కాదు. అమెరికా చరిత్రలో కోకొల్లలుగా జరుగుతూ వస్తున్నాయి. అమెరికా పోలీసు చట్టం కూడా అందుకు కొంత దోహద పడుతోంది. (చదవండి: జార్జ్‌ది నరహత్యే !)

1700 శతాబ్దంలో మొదలైన ‘స్లేవ్‌ పెట్రోల్స్‌’ కాలం నాటి నుంచి నల్లజాతీయులకు వ్యతిరేకంగా అమెరికా పోలీసుల అరాచకాలు కొనసాగుతున్నాయి. నాడు బానిసత్వంలో మగ్గుతున్న నల్లజాతీయులపైనా శ్వేతజాతీయ పౌరులు, పోలీసు అధికారులు ‘స్లేవ్‌ పెట్రోల్స్‌’ పేరిట దారుణాలకు పాల్పడేవారు. బానిసత్వానికి వ్యతిరేకంగా 1739, 1741లో నల్లజాతీయులు చేసిన తిరుగుబాట్లను అమెరికా పోలీసులు దారుణంగా అణచివేశారు. అమెరికాలో అంతర్యుద్ధం (1861–65) ముగిశాక ‘స్లేవ్‌ పెట్రోల్స్‌’కు సంబంధించిన చట్టాలను అమెరికా రద్దు చేసింది. 

అయినప్పటికీ నల్ల జాతీయులకు వ్యతిరేకంగా జరుగుతున్న దాడులకు తెర పడలేదు. ‘1965లో వాట్స్‌ రైట్స్‌’ అందుకే జరిగాయి. మార్‌క్వెట్‌ ఫ్రై అనే నల్ల జాతీయుడు తన తల్లి, సోదరుడితో కలిసి కారులో వేగంగా వెళుతుండగా, శ్వేత జాతీయుడైన కాలిఫోర్నియా హైవే పెట్రోల్‌ ఆఫీసర్‌ ఆపి, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసు కింద అరెస్ట్‌ చేసి హింసించారు. 1991, మార్చి మూడవ తేదీన రోడ్నీ కింగ్‌ అనే నల్లజాతీయుడు కారులో వేగంగా వెళుతుండగా, శ్వేతజాతి పోలీసు అధికారులు ఆపి, కారులో నుంచి గుంజీ రోడ్నీ కింగ్‌ను చితక్కొట్టారు. ఆ కేసులో అరెస్టయిన నలుగురు పోలీసు అధికారులు 1992, ఏప్రిల్‌ నెలలో నిర్దోషులుగా విడుదలయ్యారు. అందుకు వ్యతిరేకంగా నిరసనలు, అల్లర్లు కొనసాగాయి. 

2014, ఆగస్ట్‌లో 18 ఏళ్ల మైకేల్‌ బ్రౌన్‌ అనే నల్లజాతీయ యువకుడిని పోలీసు అధికారి అన్యాయంగా కాల్చి వేయడంతో దానికి వ్యతిరేకంగా ‘బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌’ ఉద్యమం పుట్టుకొచ్చింది. అయినప్పటికీ సదరు పోలీసు అధికారికి శిక్ష పడలేదు. ఆ తర్వాత ఇప్పుడు జార్జ్‌ ఫ్లాయిడ్‌ అన్యాయంగా బలయ్యారు. అమెరికా పోలీసు చట్టం శ్వేత జాతీయులైన పోలీసులను అనుకూలంగా ఉండడమేనని విమర్శకులు చెబుతున్నారు. పోలీసు వ్యవస్థలో కూడా నల్లజాతీయుల పట్ల ఎంతో వివక్షత ఉందని వారంటున్నారు. (చదవండి: జార్జ్ హత్య : సత్య నాదెళ్ల స్పందన)

మరిన్ని వార్తలు