ఆడియో బాస్.. బోస్ కన్నుమూత

14 Jul, 2013 04:37 IST|Sakshi
ఆడియో బాస్.. బోస్ కన్నుమూత

  బోస్టన్: ఆడియో సిస్టమ్స్ రంగ పదనిర్దేశకుడు, బోస్ కార్పొరేషన్ అధినేత డాక్టర్ అమర్ జి బోస్(83) కన్నుమూశారు. అత్యంత నాణ్యమైన, అత్యాధునిక ఆడియో సిస్టమ్స్, హోం థియేటర్లు అంటే.. ప్రపంచవ్యాప్తంగా అందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు బోస్ ఆడియో సిస్టమ్సే. భారతీయ అమెరికన్ అయిన అమర్ బోస్ మరణ వార్తను ఆయన కంపెనీ బోస్ కార్పొరేషన్ అధ్యక్షుడు బాబ్ మరెస్కా, మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ) వెల్లడించాయి. శుక్రవారం అమెరికాలోని వేల్యాండ్‌లోని తన నివాసంలో బోస్ తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుమారుడు డాక్టర్ వణు జి బోస్ తెలిపారు. అమర్‌బోస్ 50 ఏళ్ల క్రితం బోస్ కార్పొరేషన్‌ను స్థాపించారు.
 
 అమర్ బోస్ సిద్ధాంతాలకు అనుగుణంగా ఇకముందు కూడా ఆ కంపెనీ కొనసాగుతుందని బాబ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన దార్శనికతే మా చరిత్ర, అదే మా భవిష్యత్తు అని చెప్పారు. బోస్ కార్పొరేషన్ ఎప్పటికీ ఆయన కంపెనీగానే ఉంటుందన్నారు. బోస్ అసామాన్యమైన వ్యక్తి అని.. అనన్య ప్రతిభాపాటవాలు కలిగిన నాయకుడని ఎంఐటీ అధ్యక్షుడు రాఫెల్ రీఫ్ కొనియాడారు. ‘ఆయన ఎంఐటీ గ్రాడ్యుయేట్. ఇక్కడే 40 ఏళ్లు ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఆయనో ఆవిష్కర్త. దిగ్గజం. ఆయన మేధస్సు, అంకిత భావం, సామర్థ్యంతో ఎంఐటీని మరింత సుసంపన్నం చేశారు. అలాంటి వ్యక్తిని నేనెప్పుడూ చూడలేదు. నేను మాత్రమే కాదు.. ఎంఐటీ, ఈ ప్రపంచం ఓ మార్గదర్శిని కోల్పోయింది’ అని నివాళులు అర్పించారు.
 
 నిరాశే.. ఆవిష్కరణలకు నాంది పలికింది..
 
 అమర్ బోస్ తండ్రి నోనీ గోపాల్ బోస్ స్వాతంత్య్ర సమరయోధుడు. గోపాల్ బోస్ కలకత్తా యూనివర్సిటీలో చదువుతున్న కాలంలో అరెస్టయ్యారు. బ్రిటిషర్లకు వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహించినందుకుగానూ కొన్నాళ్లు జైల్లో ఉన్నారు. 1920లో అక్కడి నుంచి తప్పించుకుని అమెరికాకు వచ్చేశారు. ఓ అమెరికన్ టీచర్‌ను వివాహమాడారు. 1929, నవంబర్ 2న ఫిలడెల్ఫియాలో అమర్ బోస్ జన్మిం చారు. 13 ఏళ్ల వయసులోనే పాకెట్ మనీకోసం ఫిల డెల్ఫియాలోని రేడియో సెట్లు మరమ్మతు చేయడం ప్రారంభించారు. అమర్ బోస్‌కు శాస్త్రీయ సంగీతమంటే ఎంతో ఇష్టం. 1950ల్లో ఎంఐటీలో ఇంజనీరింగ్ అభ్యసిస్తున్నప్పుడు తాను కొనుగోలు చేసిన ఖరీదైన ఆడియో సిస్టమ్ నాసిరకం ఆడియోను అందించడంపై నిరాశ చెందారు. దీంతో ఆడియో ఇంజనీరింగ్ రంగంలో విశేష కృషి చేశారు. ఈ రంగంలో సరికొత్త ఆవిష్కరణలకు నాంది పలికారు. 1968లో ఆయన ఆవిష్కరించిన బోస్ 901 డెరైక్ట్ రిఫ్లెక్టింగ్ స్పీకర్ సిస్టమ్ సంచలనాలు సృష్టించింది. 25 ఏళ్ల పాటు అత్యధిక కొనుగోళ్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఖరీదైన, నాణ్యమైన ఆడియో సిస్టమ్స్ రంగంలో బోస్ కంపెనీనీ అగ్రస్థాయికి తీసుకెళ్లింది. బోస్ కంపెనీకి చెందిన స్పీకర్లు వంటివి ఖరీదైనా.. ఇంట్లోనే అత్యాధునిక థియేటర్ స్థాయి ధ్వనిని అందిస్తాయన్న పేరుంది. బోస్‌కృషే ఆయన కంపెనీని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లింది. 2010లో బోస్ కార్పొరేషన్ ఆదాయం రూ.12 వేల కోట్లు. రెండేళ్ల క్రితం తన కంపెనీకి చెందిన అత్యధిక షేర్ల(నాన్ ఓటింగ్)ను ఎంఐటీకి ఇచ్చారు. తద్వారా నాయిస్ కాన్సిలింగ్ హెడ్‌ఫోన్స్, కార్లకు సంబంధించిన సస్పెన్షన్ సిస్టమ్ వంటి వాటిల్లో మరిన్ని దీర్ఘకాలిక పరిశోధనలు చేయడానికి పూనుకున్నారు. బోస్ కార్పొరేషన్ రూపొం దించిన నాయిస్ కాన్సిలింగ్ హెడ్ ఫోన్స్‌ను సైన్యం, విమాన పైలట్లు కూడా వినియోగిస్తారు.  
 

మరిన్ని వార్తలు