ఆ ఒంటెల కథ

13 Jan, 2020 04:08 IST|Sakshi

అది 1606 సంవత్సరం. డచ్‌ అన్వేషకుడు విలియమ్‌ జాన్స్‌జూన్‌ మొదటిసారిగా ఆస్ట్రేలియా దేశాన్ని కనుగొన్న యూరోపియన్‌గా చరిత్రకెక్కాడు. అప్పట్లో ఆ దేశంలో ఆయనకి ఒక్క ఒంటె కూడా కనిపించలేదు.  

సీన్‌ కట్‌ చేస్తే...

ప్రస్తుతం 2020 సంవత్సరం. ఒంటెలతో విసిగి వేసారిపోయిన ఆస్ట్రేలియా వాటిని సామూహికంగా కాల్చి చంపే ఆపరేషన్‌ చేపట్టింది. అయిదు రోజుల్లోనే 10వేలకు పైగా మూగజీవాలను హెలికాప్టర్‌ నుంచే కాల్చి చంపేసింది. అసలు ఆ ఒంటెలు ఎలా వచ్చాయి ? ఎందుకు వచ్చాయి ?

మెల్‌బోర్న్‌: కార్చిచ్చులతో అల్లాడిపోతున్న ఆస్ట్రేలియాలో ఒంటెల హనన కాండ ప్రపంచ దేశాల గుండెల్ని పిండేస్తున్నాయి. కరువు కాటకాలతో అల్లాడిపోతున్న ఆస్ట్రేలియా తమకు ఈ ఒంటెలు మోయలేని భారంగా మారాయంటూ హెలికాప్టర్ల నుంచి గురి చూసి కాల్చి చంపేస్తోంది. వివిధ దేశాలకు చెందిన జంతు ప్రేమికులు ఆస్ట్రేలియా ప్రభుత్వం చేస్తున్న పనిని తీవ్రంగా విమర్శిస్తున్నప్పటికీ ఆ దేశం వినిపించుకునే స్థితిలో లేదు. దానికి కారణం ఒంటె అక్కడి స్థానిక జంతువు కాదు. అదీ వలస జంతువే.

భారత్‌ సహా ఎన్నో దేశాల నుంచి  
ఆస్ట్రేలియా కూడా ఒకప్పుడు బ్రిటిష్‌ వలస పాలనలోనే ఉండేది. అప్పట్లో బ్రిటీషియన్లు తమ రవాణా సౌకర్యాల కోసం ఈ ఒంటెల్ని వివిధ దేశాల నుంచి ఆస్ట్రేలియాకు సముద్ర మార్గం ద్వారా తీసుకువచ్చారు. ఎందుకంటే ఆస్ట్రేలియా పొడి వాతావరణం కలిగిన ప్రాంతం. ఆ వాతావరణంలో గుర్రాలు సరిగ్గా పరిగెత్తలేకపోయేవి. కానీ ఒంటెలు అలా కాదు. అలాంటి వాతావరణమే ఒంటెలకు అనుకూలం. అంతేకాదు రెండు, మూడు వారాలు నీళ్లు తాగకపోయినా ఒంటెలు ప్రయాణించగలవు. అందుకే బ్రిటిష్‌ పాలకులు ఒంటెల్ని తీసుకురావాలని అనుకున్నారు. 18వ శతాబ్దంలో మొదటిసారి భారత్, అఫ్గానిస్తాన్, అరబ్‌ దేశాల నుంచి ఒంటెల్ని తెచ్చారు. స్థానిక రవాణా అవసరాల కోసం ఒంటెల్ని వినియోగించేవారు. అలా అలా ఆ ఒంటెలు ఆస్త్రేలియన్ల జీవనవిధానంలో ఒక భాగమైపోయాయి.

అనూహ్యంగా పెరిగిపోయిన సంతతి
19వ శతాబ్దంలో రవాణా అవసరాల కోసం మోటార్‌ వాహనాలపై ఆధారపడ్డాక ఒంటెల అవసరం ప్రజలకి తీరిపోయింది. దీంతో వాటిని పెంచడం మానేశారు. ఆ ఒంటెలు చుట్టుపక్కల అడవుల్లోకి వెళ్లిపోయాయి. ఆస్ట్రేలియా వాతావరణం ఒంటెలు పెరగడానికి అనుకూలంగా ఉండడంతో వాటి సంతతి విపరీతంగా పెరిగిపోయింది. 1969లో కేవలం 20 వేలు మాత్రమే ఉండే ఒంటెలు, 1988 నాటికి 43 వేలకి చేరుకున్నాయి. 2001–08 మధ్య కాలంలో వాటి సంఖ్య ఏకంగా 10 లక్షలకు చేరుకుంది.

ఒంటెలు పెరిగిపోతూ ఆహారం కోసం, నీళ్ల కోసం జనావాసాలపై పడడం, పంటపొలాల్ని నాశనం చేస్తూ ఉండడంతో ఆస్త్రేలియా ప్రభుత్వం ఒంటెల్ని చంపే కార్యక్రమం చేపట్టింది. 2012లో ఏకంగా ఏడాదికి 75 వేల ఒంటెల్ని కాల్చేసింది. గ్లోబల్‌ వార్మింగ్‌ పరిస్థితుల కారణంగా ఆస్ట్రేలియాలో కొన్ని ప్రాంతాల్లో ఆహారానికి, నీటికి కటకటగా ఉంది. అందుకే వాటిని చంపేయడమే పనిగా పెట్టుకుంది ఆస్ట్రేలియా. అలా వాటి సంఖ్యను తగ్గించుకుం టూ వస్తోంది. పాపం ఆ మూగజీవాలు, అప్పుడెప్పుడో వలస పాలకులు తమ అవసరం కోసం చేసిన పని ఇప్పుడు వాటికి పెనుశాపమైంది.
► ప్రస్తుతం ఒంటెల సంఖ్య: దాదాపు 3 లక్షలు
► ఆక్రమించిన ప్రాంతం: ఆస్ట్రేలియా భూభాగంలో 37 %
► కలిగిస్తున్న నష్టం: పంట పొలాల ధ్వంసం, సాంస్కృతిక, చారిత్రక కట్టడాల విధ్వంసం, ఒంటెల సంతతి పెరిగిపోతూ ఉండడంతో దెబ్బ తింటున్న జీవ వైవిధ్యం
► దేశానికి కలిగిస్తున్న నష్టం: ఏడాదికి కోటి డాలర్ల నష్టం

మరిన్ని వార్తలు