నువ్వు ఒక మూర్ఖుడివి.. ఎప్పటికి ఓట్లు వేయం

3 Jan, 2020 15:11 IST|Sakshi

మెల్‌బోర్న్‌ : ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌కు దేశ ప్రజల నుంచి వింత అనుభవం ఎదురైంది. గత కొన్నిరోజులుగా ఆస్ట్రేలియాలోని అడవుల్లో కార్చిచ్చు అంటుకొని మంటలు వ్యాపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు 18 మంది కార్చిచ్చుకు బలవ్వగా, అందులో దేశ పౌరులు, పలువురు ఫైర్‌ ఫైటర్స్‌, వాలంటీర్లు ఉన్నారు. అయితే ప్రధాని స్కాట్‌ మోరిసన్‌ గురువారం న్యూ సౌత్‌వేల్స్‌లోని కోబార్గో పట్టణంలో పరిస్థితిని సమీక్షించేందుకు వెళ్లారు.

కాగా అక్కడ సహాయ కార్యక్రమాలు చేపడుతున్న ఒక మహిళా ఫైర్‌ ఫైటర్‌ను అభినందిస్తూ ఆమెతో కరచాలనం చేసేందుకు ప్రయత్నించారు. అయితే ఆమె ప్రధానితో కరచాలనం చేయడానికి ఇష్టపడలేదు. అంతలో అక్కడ ఉన్న మరో వ్యక్తితో కరచాలనం చేసేందుకు ప్రయత్నించగా అతను కూడా నిరాకరించి ప్రధానికి క్షమాపణ చెప్పి దూరంగా వెళ్లిపోయాడు. కాగా ఆ వ్యక్తి ఇతరుల ఇళ్లను కాపాడే ప్రయత్నంలో తన ఇళ్లును పోగొట్టుకున్నాడని ఒక అధికారి వెల్లడించారు.

'కార్చిచ్చు అంటుకొని దేశం మొత్తం తగలబడుతుంటే మీరు మాత్రం సిడ్నీ హార్బర్‌ దగ్గర్లోని కిర్రిబిల్లి హౌస్‌లో కూర్చొని కొత్త సంవత్సర వేడుకలను ఆస్వాదిస్తారా' అంటూ ఒక వ్యక్తి ప్రధానిని ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ' నువ్వు ఒక మూర్ఖుడివి.. నిన్ను మళ్లీ మేం ప్రధానిగా చూడబోమంటూ' మరొక వ్యక్తి ప్రధాని మోరిసన్‌ మీద విరుచుకుపడ్డాడు. అయితే వీటిపై ప్రధాని స్పందిస్తూ.. ' ఈరోజు ప్రజలు ఎంత ఆగ్రహంగా ఉన్నారో నా కళ్లారా చూశాను. నన్ను తిట్టినందుకు నేనేం బాధపడడంలేదు.ఎందుకంటే ఇందులో మానవ తప్పిదం ఏం లేదు. కేవలం ప్రకృతి వైపరిత్యాల వల్లే ఇలాంటివి చోటుచేసుకుంటున్నాయి. ఈరోజు మా ప్రజలు పడుతున్న బాధను దగ్గరుండి గమనించాను. మా ప్రభుత్వం తరపున వారికి కావలిసివి అన్ని ఏర్పాటు చేస్తామని' పేర్కొన్నారు.

గతేడాది మేలో జరిగిన ఎన్నికల్లో అనూహ్యంగా విజయం సాధించి   స్కాట్‌ మోరిసన్‌ ప్రధాని పదవిని చేపట్టాడు. అయితే కార్చిచ్చు అంటుకొని దేశంలోని ఐదు రాష్ట్రాలకు వ్యాపించిన సమయంలో మోరిసన్‌ తన కుటుంబంతో కలిపి హాలిడే టూర్‌ పేరుతో హవాయి నగరాన్ని సందర్శించారు. అయితే ప్రధాని తీరుపై అక్కడి ప్రజలు, విపక్షాలు, మీడియా దుమ్మెత్తిపోశారు. దీనిపై తాను క్షమాపణ కోరుతున్నట్లు మోరిసన్‌ తెలిపారు.జనవరి 13 నుంచి 16 వరకు ప్రధాని స్కాట్‌ మోరిసన్‌ భారత్‌లో పర్యటించాల్సి ఉండగా,  ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితుల దృష్యా కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు