ఆస్ట్రేలియాలో 10వేల ఒంటెలను చంపనున్నారా!

8 Jan, 2020 14:37 IST|Sakshi

సిడ్నీ : ఆస్ట్రేలియాలో అంటుకున్న కార్చిచ్చు ప్రస్తుతం ఆ దేశాన్ని అతలాకుతులం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడి అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అదేంటో తెలుసా.. అయిదు రోజుల ప్రచారంలో భాగంగా ఆస్ట్రేలియాలోని 10వేల ఒంటెలను చంపాలని నిర్ణయించారు. కాగా బుధవారం నుంచే ప్రచారాన్ని మొదలుపెట్టనున్నారు. ప్రస్తుతం కార్చిచ్చుతో పరిస్థితి దారుణంగా ఉన్న సమయంలో వేడిని భరించలేక ఒంటెలు ఎక్కువ నీళ్లు తీసుకుంటున్నాయి. అందుకే వాటిని చంపేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ మేరకు ఒంటెలను చంపడానికి ఆస్ట్రేలియా ప్రభుత్వం హెలికాప్టర్‌లను కూడా ఏర్పాటు చేసింది.

ఇదే అంశమై  అనంగు పిజంజజరా యకుంనిజజరా(ఏపీవై) ఎగ్జిక్యూటివ్‌ బోర్డ్‌ మెంబర్‌ మరీటా బేకర్‌ స్పందిస్తూ.. ‘కార్చిచ్చు అంటుకొని దేశం మొత్తం తగలబడిపోతుంది. దీనికి తోడు కార్చిచ్చు​ ద్వారా వస్తున్న వేడి , అసౌకర్య పరిస్థితులతో కనీస అవసరాలు తీర్చుకోలేకపోతున్నాము. ఒంటెలు మా కంచెలను పడగొట్టి ఇళ్ళలోకి ప్రవేశించి విచ్చలవిడిగా నీరు తాగడంతో పాటు ఏసీలను పాడు చేసి అందులోని నీటిని తాగుతూ తమ దాహర్తిని తీర్చుకొని వెళ్లిపోతున్నాయి. ఈ సమయంలో ఒంటెలు విడుస్తున్న వ్యర్థాల వల్ల వచ్చే దుర్వాసనను మేము భరించలేకపోతున్నాం' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.(కార్చిచ్చు ఆగాలంటే.. వర్షం రావాల్సిందే)

గత నవంబర్‌లో కార్చిచ్చు అంటుకొని  ఆస్ట్రేలియాలో పరిస్థితి అతలాకుతులమయింది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజలకు కనీస నీటి అవసరాలు మిగల్చకుండా ఇళ్లపై దాడి చేస్తూ ఒంటెలు నీళ్లు తాగుతున్నాయి. అందుకే చట్ట బద్ద ప్రణాళికంగానే 10వేల ఒంటెలను చంపాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే ప్రకృతి ప్రకోపానికి 12 మందికి పైగా తమ ప్రాణాలు పోగొట్టుకోగా, 480 మిలియన్ల జంతువులు కార్చిచ్చుకు బలైనట్లు తమ పరిశోధనలో తేలిందని సిడ్నీ విశ్వవిద్యాలయ పరిశధకులు అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు