చోరీకిపోయి ఇరుక్కున్నాడు

29 Feb, 2016 20:34 IST|Sakshi

పిల్లలు అల్లరి చేస్తుంటారు. అందులోనూ ఎప్పుడూ చూడని వస్తువులు కనిపిస్తే ఇంకాస్త అత్యుత్సాహం ప్రదర్శించి చిక్కులు కొని తెచ్చుకుంటారు.  ఆస్ట్రేలియాలోని ఓ నాలుగేళ్ళ కుర్రాడి విషయంలో అదే జరిగింది. అంతకు ముందు ఎప్పుడూ చూడలేదో ఏమో కొత్తగా కనిపించిన వెండింగ్ మెషీన్ లో చేతులు పెట్టి ఇరుక్కు పోయాడు. అదృష్టం బాగుండి ఆరుగంటలు దాటాక ఎటువంటి అపాయం లేకుండా బయట పడ్డాడు.  

ఆస్ట్రేలియా బెల్బోర్న్ సిటీ సెంటర్ లో లియో అనే నాలుగేళ్ళ చిన్నారి బిస్కెట్లు, చాక్లెట్లు అమ్మకానికి వినియోగించే వెండింగ్ మెషీన్ లో చేతులు పెట్టేశాడు. విషయాన్ని గమనించిన అక్కడివారు వెంటనే ఫైర్ సిబ్బందికి ఇతర అధికారులకు సమాచారం అందించడంతో సహాయక చర్యలు చేపట్టారు. జరిగిన ఘటనతో చిన్నారి ఎంతో భయాందోళనలకు గురయ్యాడని, దీంతో సహాయక చర్యలు అతి సున్నితంగా నిర్వహించాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. అయితే బిస్కెట్లు, చాక్లెట్లను దొంగతనంగా చేజిక్కించుకోవడంకోసం లియో వివిధ పద్ధతుల్లో ప్రయత్నాలు చేశాడని చివరికి అవి దక్కక పోగా చేతులు మెషీన్ లో ఇరుక్కుపోయాయని అధికారులు చెప్తున్నారు.

ఆరు గంటలపాలు నిర్వహించిన రెస్క్యూ ఆపరేషన్ సమయంలో లియో పలుమార్లు ఆందోళనకర స్థితికి చేరుకున్నాడు. మెషీన్లో ఇరుక్కున్న లియో చేతులను తీసేందుకు మెషీన్ ను కట్ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో లియో అరుపులను విని ఎంతో భయం వేసిందని, అతని దృష్టిని మరిపించేందుకు స్మార్ట్  ఫోన్లు వంటివి చూపించామని  చుట్టుపక్కల వీధుల్లోని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం లియోకు ఎటువంటి ప్రమాదం లేదని, శరీరంపై ఎటువంటి గాయాలుకూడ కనిపించడం లేదని అధికారులు తెలిపారు. అయినప్పటికీ అతడ్ని పరిశీలించేందుకు మెల్బోర్న్ లోని రాయల్ ఛిల్డ్రన్స్ హాస్పిటల్ కు తరలించామని అన్నారు.  ఇదిలా ఉంటే మా అబ్బాయి ఇంతకు ముందెప్పుడూ వెండింగ్ మిషన్  చూసినట్లు లేడని,  బహుశా ఇదే మొదటిసారి కావడంతో బిస్కట్లు, చాక్లెట్లకోసం అందులో చేతులు పెట్టి ఉంటాడని నార్తరన్ టెర్రిటరీ ఆర్నెమ్ ల్యాండ్ లో నివసించే లియో తండ్రి ఆరోన్ అంటున్నాడు. ఏది ఏమైనా తమ కొడుకు సురక్షితంగా బయటపడటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.

మరిన్ని వార్తలు