నా మొసలి స్నేహితుడ్ని స్వేచ్ఛగా వదిలేయండి

11 Sep, 2019 08:38 IST|Sakshi

కాన్‌బెర్రా : ఓ 10 సంవత్సరాల బాలుడు 13 అడుగుల భారీ ఉప్పునీటి మొసలికి అండగా నిలిచాడు. తన మొసలి స్నేహితుడ్ని స్వేచ్ఛగా ఉన్నచోటే వదిలేయాలంటూ రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రికి లేఖ రాశాడు. వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌ సమీపంలోని మియాలో అనే గ్రామానికి చెందిన ఎల్‌రాయ్‌ వుడ్స్‌ అనే 10 ఏళ్ల బాలుడికి అక్కడి చెరువులో ఉంటున్న 13 అడుగుల మొసలి ‘‘ హావర్డ్‌’’ అంటే ఎంతో ఇష్టం. ప్రతిరోజు నీటిలో సంచరించే మొసలిని చూస్తూ ఆనందపడిపోయేవాడు. అయితే మొసలి కారణంగా అక్కడ ఉంటున్న ప్రజలకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని భావించిన పర్యావరణ అధికారులు దాన్ని పట్టి వేరేచోట వదిలేయాలని భావించారు. ఇందుకోసం అక్కడి నీటిలో వలవేసి ఉంచారు. అధికారుల నిర్ణయంతో వుడ్స్‌ కలత చెందాడు. ఎలాగైనా తన మిత్రుడ్ని అది ఉంటున్న చోటే స్వేచ్ఛగా బ్రతకనివ్వాలనుకున్నాడు.

ఈ మేరకు ఆ రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి లీయన్నే ఎనోచ్‌కు లేఖ రాశాడు. ఆ లేఖలో‘‘  నా పేరు ఎల్‌రాయ్‌ వుడ్స్‌. నేను గత ఐదు సంవత్సరాలుగా బాంబూ క్రీక్‌ రోడ్‌లో నివాసముంటున్నాను. హావర్డ్‌(మొసలి) అంటే నాకు ఎంతో ఇష్టం. అక్కడి బ్రిడ్జి మీద నుంచి నీటిలో ఈదుతున్న దాన్ని చూడటమంటే ఎంతో సరదా. మీరు హావర్డ్‌ను పట్టకుండా అదున్న చోటే వదిలేయండి’’ అంటూ వేడుకున్నాడు. దీనిపై స్పందించిన ఆస్ట్రేలియా జూ అధికారులు వుడ్స్‌కు అండగా నిలిచారు. ప్రభుత్వం కూడా ఓ మెట్టు దిగి దాన్ని పట్టకుండా ఉంటామని హామీ ఇచ్చింది.

మరిన్ని వార్తలు