రివ్యూలు తారుమారు : దిగ్గజ హోటల్‌కు భారీ ఫైన్‌

1 Aug, 2018 17:04 IST|Sakshi
ఆస్ట్రేలియా అతిపెద్ద హోటల్‌ మెరిటన్‌ ప్రాపర్టీ సర్వీసులు

ఏదైనా ఒక వస్తువు గురించి కానీ, ప్రాంతం గురించి కానీ, సినిమాల గురించి కానీ తెలుసుకోవాలంటే... ముందస్తుగా రివ్యూల బాట పడతాం. వాటి గురించి రివ్యూల్లో ఏం చెప్పారా? అని వెతుకులాట మీద వెతుకులాట చేపడతాం. అసలకే ఖర్చు పెట్టి వెళ్తాం. అది బాగోపోతే ఆ ఖర్చంతా వృథా అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పటికే వాటి అనుభవాలను పొందిన వారు, సందర్శకులు వాటి గురించి ప్రముఖ వెబ్‌సైట్లలో తమ తమ రివ్యూలు ఇస్తూ ఉంటారు. వీటిని చదివే చాలా మంది నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. ఈ రివ్యూల్లో తమ గురించి ఎలాంటి తప్పుడు రివ్యూలు రాకుండా.. మంచిగా మాత్రమే స్పందించేలా కొన్ని యజమాన సంస్థలు జాగ్రత్త పడుతూ ఉంటాయి. తాజాగా ఆస్ట్రేలియాలో ఓ దిగ్గజం హోటల్‌ ఇదే పని చేసి, భారీ జరిమానాను ఎదుర్కొంది. 

ఎక్కువ మంది సందర్శించే పాపులర్‌ ట్రిప్‌అడ్వయిజర్‌ వెబ్‌సైట్‌లో తమ గురించి తప్పుడు రివ్యూలు రాకుండా.. ఆస్ట్రేలియా అతిపెద్ద హోటల్‌ మెరిటన్‌ ప్రాపర్టీ సర్వీసులు అక్రమాలకు పాల్పడింది. దీంతో వినియోగదారులు ఇచ్చే ఫిర్యాదులేమీ రివ్యూల్లో నమోదు కాలేదు. ఇలా మోసపూరితంగా.. ట్రిప్‌అడ్వయిజరీలో మెరిటన్‌ రివ్యూలను తారుమారు చేస్తుందని తేల్చిన ఆస్ట్రేలియా ఫెడరల్‌ కోర్టు.. 2.2 మిలియన్‌ డాలర్లు అంటే 15 కోట్ల రూపాయల జరిమానా విధించింది. 2014 నవంబర్‌ నుంచి 2015 అక్టోబర్‌ మధ్యకాలంలో మెరిటన్‌ ఈ తప్పుడు కార్యకలాపాలకు పాల్పడిందని కోర్టు తెలిపింది. 

ఈ కంపెనీ ఆస్ట్రేలియా వినియోగదారుల చట్టంలో మొత్తం 13 ఉల్లంఘనలకు పాల్పడిందని పేర్కొంది. సౌత్‌ వేల్స్‌, క్వీన్‌ల్యాండ్‌లో మొత్తం 13 ప్రాపర్టీలను ఈ హోటల్‌ కలిగి ఉంది. ఇలా ఉల్లంఘనలకు పాల్పడి, కేవలం మంచి రివ్యూలే సంపాదించి.. ట్రిప్‌అడ్వయిజర్‌ వెబ్‌సైట్‌లో ప్రాపర్టీ ర్యాంకును మెరుగుపరుచుకుంది. ఈ విషయం గురించి తమకు 2015 అక్టోబర్‌లో తెలిసిందని, ఈ విషయం తెలియడంతోనే వెంటనే  దీనిపై విచారణకు, స్వతంత్ర నియంత్రణకు ఆదేశించినట్టు  ట్రిప్‌అడ్వయిజర్‌ తెలిపింది. ఈ జరిమానాతో పాటు ట్రిప్‌అడ్వయిజర్‌కు ఇచ్చే గెస్ట్‌ ఈ-మెయిల్‌ అడ్రస్‌లను మెరిటన్‌ ఫిల్టర్‌ చేయడం, ఎంపిక చేయడంపై కోర్టు నిషేధం విధించింది. 

మరిన్ని వార్తలు