‘స్వలింగ’ వివాహాలకు ఆస్ట్రేలియాలో చట్టబద్ధత

8 Dec, 2017 02:50 IST|Sakshi

సిడ్నీ: స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పిస్తూ ప్రవేశపెట్టిన బిల్లును ఆస్ట్రేలియన్‌ పార్లమెంట్‌ ఆమోదించింది. ఈ బిల్లును ఇంతకుముందు పార్లమెంట్‌ ఎగువసభ సెనేట్‌ 43–12 మెజారిటీతో ఆమోదించగా.. గురువారం కాన్‌బెర్రాలో సమావేశమైన ప్రతినిధుల సభ (దిగువ సభ) 146–4 మెజారిటీతో ఆమోదం తెలిపింది. ప్రతినిధుల సభలో బిల్లు ఆమోదం పొందగానే సభ్యులు ఆనందంతో చప్పట్లు కొడుతూ, పరస్పరం ఆలింగనాలతో హర్షం వ్యక్తం చేశారు.

తొలి నుంచి స్వలింగ సంపర్కుల వివాహాలకు మద్దతు ఇస్తున్న ఆస్ట్రేలియా ప్రధాని మాల్కం టర్న్‌బుల్‌ మాట్లాడుతూ..‘సమానత్వానికి, గౌరవానికి, ప్రేమకు ఇది అద్భుతమైన రోజు. ఆస్ట్రేలియా ఎట్టకేలకు సాధించింది’ అని ప్రకటించారు. తాజా చట్టం ప్రకారం ఇకపై స్వలింగ సంపర్కులు తమ వివాహానికి నోటీస్‌ దాఖలు చేయవచ్చు. నోటీస్‌ దాఖలు చేసిన 30 రోజుల తర్వాత వివాహం చేసుకోవచ్చు. ఈ నిర్ణయాన్ని ప్రతిపక్ష లేబర్‌ పార్టీ నేత షార్టెన్‌ స్వాగతించారు. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించిన దేశాల సరసన ఆస్ట్రేలియా చేరింది.

మరిన్ని వార్తలు