నదికి నిప్పు పెట్టాడు!

26 Apr, 2016 10:34 IST|Sakshi
నదికి నిప్పు పెట్టాడు!

అప్పుడెప్పుడో తగలబడుతున్న రోమ్ నగరాన్ని చూస్తూ ఫిడేల్ వాయించాడు నీరో. ఇప్పుడొక పార్లమెంటేరియన్ గలగలా పారుతున్న నదిని తగలబెట్టి, వీడియోను పోస్ట్ చేశాడు. ఇతనిదీ ఆ చక్రవర్తి లాంటి వెర్రితనమా? లేక పైశాచిక ఆనందమా? అసలు నీళ్లను మండించడం, నదిని తగలబెట్టడం సాధ్యమేనా? అసలింతకీ ఆ ఎంపీ ఎందుకాపని చేశాడు?

 

క్వీన్స్ లాండ్  నుంచి ఆస్ట్రేలియన్ పార్లమెంట్ కు ప్రాతినిధ్య వహిస్తున్న జెర్మీ బకింగ్ హమ్ ప్రతిపక్ష గ్రీన్స్ పార్టీకి చెందిన ఎంపీ. అదే ప్రాంతంలో ప్రవహించే కాండమైన్ నదికి నిప్పు పెట్టాడు. అల్యూమినియంతో తయారుచేసిన చిన్నపాటి బోటులో నది మధ్యలోకి వెళ్లి, కేవలం చిన్న సిగరెట్ లైటర్ తో నదిలో మంటను పుట్టించాడు. నిమిషాల్లోనే కాండమైన్ ఉపరితలమంతా అగ్గిరాజుకుంది. దాదాపు గంటన్నరపాటు , ఉవ్వెత్తున ఎగిసిపడుతూ మంటలు ప్రతాపాన్ని చూపాయి. ఈ దృశ్యాలను వీడియో తీసి సోమవారం తన ఫేస్ బుక్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు జెర్మీ బకింగ్ హమ్. అంతే. ఆస్ట్రేలియన్ మీడియా సహా ప్రపంచంలోని ప్రముఖ వార్తా సంస్థలన్నీ జెర్మీ చర్యపై చర్చలు చేపట్టాయి. బాధ్యతగల ఎంపీ అయిన జెర్మీ నదికి నిప్పెందుకు పెట్టాడు? అంటే..

నిరసన. అవును. ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలు కలిసికట్టుగా అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టడంలో భాగంగానే తానీ నిరసన చర్యకు దిగినట్లు పేర్కొన్నాడు జెర్మీ. క్వీన్స్ లాండ్ లో, ప్రధానంగా కాండమైన్ నదీ తీరంలోని బొగ్గు కంపెనీలు పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాయని ఆరోపిస్తున్నాడు. 'కోల్ సీమ్ గ్యాస్ - సీఎస్ జీ (బొగ్గు నిక్షేపాల్లో దాగుండే సహజ వాయువు) వెలికితీతలో ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తున్న ప్రమాదకరమై పద్ధతులు, వారికి వంతపాడుతున్న ప్రభుత్వ సంస్థల తీరును ప్రజలకు తెలియ చెప్పడమే నా ఉద్దేశం. ఒక్క కాండమైన్ నదే కాదు ఆస్ట్రేలియాలోని అన్ని నదీతీరాల్లో ఇదే పరిస్థితి' అని అంటాడు జెర్మీ.

నది ఎలా మండిందంటే..
వేల ఏళ్లు భూమి పొరల్లో చోటుచేసుకునే మార్పుల వల్ల ఈథేన్, ప్రోపేన్, బ్యూటేన్, పెంటేన్, మీథేన్ వంటి సహజవాయువులు ఏర్పాడతాయి. ఈ నిక్షేపాలు ఉన్న చోట పెద్దపెద్ద కంపెనీలు వాటిని వెలికి తీసేపనిని చేపడతాయి. మన ఓఎన్ జీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ తదితర కంపెనీలు సహజవాయును వెలికితీసి నిత్యావసరాకు అందిస్తారని తెలిసిందే. ఈ తరహా వాయువులు బొగ్గు నిక్షేపాలు అధికంగా ఉండే ప్రాంతంలోనూ ఉంటాయి. వాటినే కోల్ సీమ్ గ్యాస్ (సీఎస్ జీ) అంటారు. సహజవాయువును వెలికి తీసినట్లే సీఎస్ జీని ఫ్రాకింగ్ లేదా డిగ్గింగ్ విధానంలో బయటికి తీస్తారు. అలా చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించకుంటే సదరు వాయువులు రిఫైనరీ చుట్టుపక్కల వ్యాపించి, వాటర్ బాడీస్ (నీటి నిల్వల)పైన బుడగల రూపంలో పేరుకుపోతాయి. ఒక్క బుడగకు మంటపెడితే, ఇక అగ్నిదేవుడు తనపని తాను చేసుకుపోతాడు.

గతంలోనూ నదులు మండాయి!
కాండమైన్ కు సమీపంలో కోల్ సీమ్ గ్యాస్ వెలికితీత వల్ల ఆ నదిలో మీథేన్ గ్యాస్ బబుల్స్ ఏర్పడుతున్నాయని 2012లోనే వెలుగులోకి వచ్చింది. అయితే నిరంతరం పరీక్షలు నిర్వహించి కంపెనీలను హెచ్చరించాల్సిన ప్రభుత్వ సంస్థలు మిన్నకుండిపోయాయి. అలా నిర్లక్ష్యం చేస్తే జరగబోయే ప్రమాదం ఎంత భారీగా ఉంటుందో చిన్న శాంపిల్ చేసి చూపించాడు ఎంపీ జెర్మీ బకింగ్ హమ్. నిజానికి నదులు మండిపోవడం కొత్తేమీకాదు! 1969లో ఇదే ఆస్ట్రేలియాలోని క్లైవ్ ల్యాండ్స్ లో ఇదే బొగ్గు సంస్థల చర్యలను నిరసిస్తూ ఓ లాయర్ కుయాహోగా నదికి నిప్పుపెట్టాడు. తాగిపారేసిన సిగరెట్ పీక విసిరేయడంతో చైనాలోని వెంజువో ప్రాంతలో కాలుష్యంతో నిండిపోయిన ఒక నది తగలబడ్డ సంఘనట 2014లో చోటుచేసుకుంది.

మన కోల్ బెల్ట్ పరిస్థితి ఏంటి?
ప్రపంచంలోనే బొగ్గు ఉత్పత్తిలో మన దేశానిది 3వ స్థానం. (ఆస్ట్రేలియాది 4వ స్థానం) గంగ, గోదావరీ నదులకు అతి సమీపంలోనే భారీ బొగ్గు క్షేత్రాలున్నాయి. వాటి నుంచి కోల్ సీమ్ గ్యాస్ ను వెలికితీస్తే మన జీవనదులు కూడా మండిపోయే ప్రమాదం ఉండేది. అయితే మనదగ్గరున్న బొగ్గు నిల్వల్లో గ్యాస్ నిక్షేపాల శాతం తక్కువ కావడం, ప్రభుత్వం కూడా బొగ్గు ఉత్పత్తికే అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల అలాంటి పరిస్థితి తలెత్తలేదు. కానీ ఇప్పటికీ మన కోల్ మైన్స్ లో ప్రమాదకరమైన వాయువులు లీకై కార్మికులు చనిపోతుంటారు.  గతంలో కార్మికులు పనిలోకి వెళ్లేముందు మైన్ లోకి పక్షులను పంపేవారు. అవి తిరిగొస్తే అక్కడ గ్యాస్ లీకేజీ లేనట్లు భావించేవారు. ఇప్పుడు టెక్నాలజీని ఉపయోగిస్తున్నప్పటికీ కొన్నసార్లు ప్రమాదాలు తప్పట్లేదు.